Land Grabs in Anantapur : అనంతపురాన్ని అడ్డాగా చేసుకుని భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా నగరం వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిన వారి భూములతో పాటు, అమాయకులైన వారి ఆస్తులను కొల్లగొట్టడానికి కొందరు పెట్రేగిపోతున్నారు. నగరంలోని సర్వేనెంబర్ 95లోని భూమిలో కొందరు గుడిసెలు వేయించగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అధికారులకు మొరపెట్టుకుంది.
ఆక్రమణదారుల నుంచి డబ్బు డిమాండ్ పెరగడంతో ఆ ఉపాధ్యాయురాలు సామాజిక మాధ్యమం వేదికగా తమ భూమి ఆక్రమించారని న్యాయం చేయాలంటూ వీడియో విడుదల చేసింది. దీనికి స్పందించిన అనంతపురం ఆర్డీఓ ఇటీవల పోలీసుల రక్షణతో సిబ్బందిని తీసుకెళ్లి సర్వేచేయించి అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించారు. ప్రస్తుతం మరోచోట పట్టాభూమిని ఆక్రమించిన కబ్జాదారులు పైగా భూ యజమానులపైనే బెదిరింపులకు దిగుతున్నారు. అందలో నుంచి గుడిసెలు తొలగించాలంటే డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
''మా భూముల్లోకి అక్రమంగా వచ్చి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇవి మా భూములు ఇని చెప్పినా కూడా వినకుండా మమల్నే బెదిరిస్తున్నారు. మేము ఇక్కడి నుంచి వెళ్లాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.'' - ఈశ్వర్ ప్రసాద్, బాధితుడు
నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక శ్మశానం ఆనుకుని సర్వే నెంబర్లు 89, 90, 91లో రెండు ఎకరాల పట్టా భూమి ఉంది. దీనిని మూడు దస్తావేజుల ద్వారా ఐదుగురు కొనుగోలు చేశారు. సుమారు ఆరు దశాబ్దాల నుంచి భూ యజమానులు అందులో పశుగ్రాసం సాగుచేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో, వెబ్‌ల్యాండ్‌లో ఇది పట్టా భూమిగా, యజమానుల పేర్లమీదే ఉంది. 20 రోజుల క్రితం సాగులో ఉన్న భూమిలో దౌర్జన్యంగా జెండాలు పాతి, కొందరు పేదలను అక్కడకు తీసుకొచ్చి గుడిసెలు వేయించారని భూ యజమానులు వాపోతున్నారు. ఐతే తాము పోరంబోకు భూముల్లోనే గుడిసెలు వేశామని అక్కడి వారు చెబుతున్నారు.
Land Mafia in Anantapur : గత 15 రోజులుగా భూ అక్రమణల ఫిర్యాదులే అధికంగా వస్తున్నట్లు ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు. సంబంధిత భూములను సర్వే చేసి ఆక్రణలను తొలగిస్తామని చెప్పారు. తమ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి తిరిగి తమనే బెదిరిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భూ బాధితులు కోరుతున్నారు.
విశాఖలో భూముల కబ్జాలపై సిసోదియా ఆధ్వర్యంలో విచారణ - RP Sisodia Inquiry on Land Grabs