Ancient Method of Grain Storage: అక్కడ ప్రతి ఇంటి ముందు మట్టి దిమ్మలు దర్శనమిస్తాయి. ఆవుపేడతో వాటిని అందంగా అలంకరించి.. ముగ్గులు కూడా వేశారు. అసలు ప్రతి ఇంటి ముందు ఈ దిమ్మలు ఎందుకు వెలిశాయి..? ఈ దిమ్మల కింద ధాన్యం ఎందుకు దాస్తున్నారు అంటే.. దీని వెనుక ఆసక్తికర నేపథ్యం, ఆరోగ్య రహస్యం దాగి ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలతో పాటు.. సరిహద్దు ఒడిశా ప్రాంతాల్లో కూడా పాతర ధాన్యానికి ఓ ప్రత్యేకత ఉంది. పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు తమ అవసరాలకు సరిపడా ఉంచుకుని.. మిగిలిన ధాన్యం అమ్మేస్తారు. తమ కోసం ఉంచుకున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు.. ఇంటి ముందు ఆరడుగుల లోతు గొయ్యి తవ్వుతారు.
వరిగడ్డితో పెద్దతాడు తయారు చేసి.. గోతుల కింద, అంచులకు రెండు వరుసలు ఏర్పాటుచేస్తారు. అనంతరం ధాన్యం పోసి మళ్లీ గడ్డితో కప్పేస్తారు. దానిపై మట్టి వేసి, ఆవుపేడతో పైన అలుకుతారు. ఆరు నెలల పాటు నిల్వ చేసిన ధాన్యాన్ని.. వర్షాకాలం ప్రారంభంలో వెలికితీసి బియ్యంగా మార్చుకుంటారు. పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వస్తున్న ఈ పద్ధతిని.. ఇప్పటికీ ఇక్కడి రైతులు పాటిస్తున్నారు. ఇలా పాతరేసిన ధాన్యంలో పోషకాలు పెరగడంతో పాటు.. పురుగుల నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
గోతిలో నిల్వ చేసిన ధాన్యానికి అదనపు పోషకాలు సమకూరుతాయని, రుచికరంగానూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇంటి ముందున్న మాళిగ పరిమాణాన్ని బట్టి.. ఇంటి యజమాని ఆస్తులను లెక్క వేస్తారు. పూర్వీకుల పద్ధతి అనుసరించడాన్ని ఇక్కడి రైతులు గౌరవంగా భావిస్తారు.
"ఇది పాత రోజులనుంచి వస్తున్న ఒక మంచి పద్ధతి. మట్టిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి, ధాన్యం గడ్డిని చూట్టూ వేస్తారు. అందులో ధాన్యం పోసి, మట్టితోనూ ఆవుపేడతోనూ సీల్ చేస్తారు. ఇలా చేయడం వలన రుచికరంగా ఉంటుంది. కుకింగ్ క్వాలిటీ మారుతుంది". - పి.శ్రీదేవి, వ్యవసాయ అధికారి, ఇచ్ఛాపురం మండలం
"పాతరని ఆరు అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవులో తీసి.. కుటుంబానికి సరిపడా ధాన్యం వేస్తాం. చూట్టూ గడ్డి వేస్తాం, మధ్యలో ధాన్యం వేసి.. పేడతో అలికి.. శుభ్రం చేస్తాం. అలా ఆరు నెలలు ఉంటుంది". - నూకయ్యరెడ్డి, ఛైర్మన్, ఇచ్ఛాపరం వ్యవసాయ సలహా మండలి
ఇవీ చదవండి: