శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)కి పర్యవేక్షణ కొరవడింది. దశాబ్దాల చరిత్ర, ఏడాదికి రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన ఈ యార్డుకు అభివృద్ధి, సంక్షేమ పరిస్థితులను పర్యవేక్షించాల్సిన ఛైర్మన్‌ను నియమించకపోవడమే కారణం. దీంతో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. మూడేళ్లుగా ఉన్న ఖాళీని భర్తీ చేస్తే అభివృద్ధి మరింతగా జరిగేదని రైతులు అంటున్నారు.
నిరీక్షణ ఇంకా ఎన్నాళ్లు ?
పాతపట్నం వ్యవసాయ మార్కెట్‌లో ఛైర్మన్ పోస్టు సుమారు మూడేళ్లుగా ఖాళీగా ఉంది. ప్రభుత్వం మార్పుతో జిల్లాలో పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఛైర్మన్ల నియామకం జరిగింది. ముందుగా పాతపట్నం కమిటీ ఛైర్మన్ నియామకానికి అధికార పార్టీ నాయకుల నుంచి ఎంపిక చేయడంలో ఆలస్యం కనిపించింది. పలువురు ఆశావహులు ముందుకు రావడంతో ఎంపిక చేయడం కష్టమయింది. ఒకరికి ఇస్తే మరొకరు అసంతృప్తి చెందుతారన్న ఉద్దేశంతో ఎంపిక ఆలస్యం జరిగింది. ఏడాది క్రితం స్థానిక కమిటీ నుంచి ప్రతిపాదనలు పంపించారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఛైర్మన్ నియామకానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ నియామానికి ఆలస్యం జరుగుతోంది. సుమారు ఏడాది అవుతున్నా జాప్యం జరుగుతుంది.
అభివృద్ధికి అవకాశాలు
వ్యవసాయ మార్కెట్ కమిటీ దశాబ్దాల కిందట ఏర్పడింది. సమీప ప్రాంతాల రైతుల ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు భారీ ఎత్తున గోదాములను ఏర్పాటు చేశారు. ఉత్పత్తులను ఎండబెట్టుకునేందుకు మండీను నిర్మించారు. అలాగే తూకం గోదాము సైతం ఏర్పాటు చేశారు. విశాలమైన ప్రదేశం ఉండడంతో ఈ ప్రాంత రైతులకు సౌకర్యాలను కల్పించేందుకు అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే సందర్భంగా సుంకం వసూలు చేసేందుకు ప్రత్యేక తనిఖీ కేంద్రాలు సైతం ఉన్నాయి. తద్వారా కమిటీకు మంచి ఆదాయం ఉంది. పాడి రైతుల ప్రయోజనానికి గతంలో పశువైద్య శిబిరాలను సైతం నిర్వహించేవారు నేడు అటువంటి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసక్తి ఉన్న రైతుల ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం అవసరమైన వారికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడంతో పాటు మరిన్ని సదుపాయాలు ఉన్నాయి. ఆయా పథకాలు సక్రమంగా అమలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.
ప్రతిపాదనలు పంపించాం
ఇటీవల ఛైర్మన్ నియామకానికి అవసరమైన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో నియామకం జరిగే అవకాశాలున్నాయి.
-ఎ.రాజామోహనరావు, కార్యదర్శి, ఏఎంసీ, పాతపట్నం
ఇదీ చూడండి. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కొవాగ్జిన్ టీకాలు