Alluri District News Today: కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఇబ్బందులు వర్ణనాతీతం. సరైన మౌలిక సౌకర్యాలు లేక వారు విద్య, వైద్యం, ఆహారం, గృహవసతి ఇలా ఏ విధంగా చూసినా వారు వెనుకబడి ఉండాల్సిన దుర్భరమైన పరిస్థితి. ఇప్పటికే చాలా చోట్ల గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజానీకం పడే కష్టాలను తరచూ వార్త పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ అసౌకర్యాలను గిరిజనులే కాదు అక్కడకు పర్యటనకు వెళ్లిన అధికారులు సైతం అనుభవించాల్సిన పరిస్థితి అల్లూరి జిల్లాలో వెలుగుచూసింది.
అధికారులకు సైతం తప్పని డోలీ కష్టాలు: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గుమ్మ కోట పంచాయతీ కర్రిగుడలో డయేరియాతో అస్వస్థతకు గురైన ఓ మహిళ మృతి చెందినట్లు కథనాలు వచ్చాయి. దీనికి హుటాహుటిన స్పందించిన కలెక్టర్ వైద్య సిబ్బంది, ఎంపీడీవో లు తక్షణమే అక్కడకు వెళ్లి పరిశీలించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్య సిబ్బంది, ఎంపీడీవో కుమార్ ఎనిమిది కిలోమీటర్ల కొండ ఎక్కి కర్రిగూడను సందర్శించారు. గ్రామాన్ని అంతటినీ తిరిగి అక్కడి పరిస్థితిని గమనించిన అధికారులు, వైద్యులు కలిసి అక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అందరికీ వైద్య పరీక్షలు చేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఎంపీడీవో కుమార్ కు బీపీ పూర్తిగా తగ్గిపోయి అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్థానికుల సాయంతో నాలుగు కిలోమీటర్ల మేర డోలిమోసి రహదారికి తీసుకొచ్చారు. కొండ ప్రాంతాలు చేరుకోవాలంటే గిరిజనులతో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు.
ఇలాంటివి మరెన్నో.. నిండు గర్భిణి అయిన ఒక గిరిజన మహిళ ప్రసవ వేదనతో డోలీలో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది, అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి సరైన రహదారి సౌకర్యం లేని కారణంగా డోలీలో వెళ్తూ ప్రాణాల్ని విడిచాడు. సరైన వైద్య సౌకర్యాలు లేక అస్వస్థతకు గురై తగిన సమయంలో చికిత్స అందని కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు బాధ్యత వహించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.