Plans to Save Hyderabad From Flood Threat : అరగంట వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయమవుతాయి. వరద ముప్పు నుంచి హైదరాబాద్ మహా నగరాన్ని రక్షించేందుకు మహా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ కార్యాచరణ ప్రణాళికను నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ రూపొందిస్తోంది. 2050 అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ అంశాలపై రూపొందిస్తున్న మహా ప్రణాళికలో వరద మళ్లింపే కీలకమైంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఈ ప్రణాళిక సిద్ధం కానుంది.
పర్యావరణ అసమతౌల్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నట్లుండి ఒకేసారి కుండపోత వర్షం కురుస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఈ తరహా వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఆస్తినష్టం అపరిమితంగా ఉంటోంది. ఇటీవల విజయవాడలో జరిగిన వరద బీభత్సమే దీనికు నిదర్శనమని చెప్పవచ్చు. హైదరాబాద్ కూడా 2020 సంవత్సరంలో ఇలానే వరదలతో వణికిపోయింది. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మరింతగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
"భారీ వర్షాల ఎఫెక్ట్" తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - తిరుపతి విమానం దారి మళ్లింపు
ఈ నేపథ్యంలో వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2050 నాటికి అవుటర్ రింగు రోడ్డు పరిధిలో అభివృద్ధి చెందే నగరం అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్న ఈ ప్రణాళికలో వరద మళ్లింపు కీలకమైనది. హైదరాబాద్‌లో ఇప్పుడున్న నాలా వ్యవస్థ రోజుకి 8 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. 2020 అక్టోబరు నెలలో ఒక్కరోజే 19.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోజుల తరబడి బురదతో జనం అల్లాడిపోయారు.
వరదను నాలాల ద్వారా చెరువుల్లోకి అక్కణ్నుంచి మూసీలోకి : నగరంలో మూసీకి ఇరువైపులా 15 వరకూ చెరువులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తొలుత వరద నీటిని ఈ చెరువుల్లోకి, అక్కడ నుంచి మూసీలోకి మళ్లించడం ద్వారా వరద ముప్పును ఎదుర్కోవచ్చనే అలోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఉన్నవాటిల్లో పూడిక పేరుకుపోయింది. చెరువుల్లోకి కలిసే నాలాలూ పూడిపోయాయి. అందుకే చెరువుల ప్రస్తుత సామర్థ్యం, వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపైనా అధ్యయనం చేస్తున్నారు. చెరువులకు చేరిన నీరు మూసీలో కలిసేలా వ్యూహరచన చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పథకానికి ఇది ఊతమిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
ముంపు సమస్యకు పరిష్కారం - విజయవాడలో మళ్లీ మొదలైన పనులు - శరవేగంగా నిర్మాణాలు