రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందవలసిన సేవలన్నీ వారి గ్రామాల్లోనే అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ శాఖ కమిషనర్ హనుమంత్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో రైతులతో ఏర్పాటుచేసిన చర్చాగోష్టి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ ఏటీఎం కేంద్రాల ద్వారా రైతులు వారికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వాటి ధరలు మొదలైన వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. పంట అమ్ముకోవటానికి కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఆయా గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాలు వద్దనే ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయటం జరుగుతుందని తెలిపారు.
పశువుల ప్రాథమిక చికిత్స, సంరక్షణకు అవసరమైన సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రామ సచివాలయంలో పాడి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందజేయడానికి పశుసంవర్ధక శాఖ సహాయకులు ఉంటారని, అందుబాటులో మందులు కూడా ఉంటాయని తెలిపారు. పంట రుణాలు తీసుకున్న రైతులు రుణం మాత్రం చెల్లిస్తే సరిపోతుందని దానిపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో నమోదు కావడంవల్ల రైతులకు శాస్త్రవేత్తలు, మేధావులతో అవగాహన కల్పించడంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తామన్నారు. ఈ సదవకాశాలను రైతులు సద్వినియోగ పరచుకొని అభివృద్ధి చెందాలని కమిషనర్ సూచించారు.