శ్రీకాకుళం జిల్లా కొత్తూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సహాయ సంచాలకులు భ్రమరాంబ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన మధు, షణ్ముఖ రావు వ్యాపారం చేస్తుంటారు. అయితే వారి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు, ఎరువులు, పురుగుల మందులు దుకాణాల నిర్వహణకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే తనకు రూ. 40 వేలు లంచం ఇవ్వాలని ఏడీఏ భ్రమరాంబ డిమాండ్ చేశారు. వేధింపులకు గురవుతున్న వ్యాపారులు ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు పర్యవేక్షణలో రూ. 25 వేలకు ఇచ్చేందుకు వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం గురువారం రాత్రి రూ 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని శుక్రవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పి రమణమూర్తి తెలిపారు. ఈ దాడుల్లో భాస్కర్ హరి సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.
ఇదీచదవండి
Curfew Extended: చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం..రాత్రి కర్ఫ్యూ మరికొంత కాలం పొడిగింపు