Actions against YSRCP dissident leaders: శ్రీకాకుళం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు మరోసారి ఆసక్తిగా మారాయి. దీనికి ప్రధాన కారణం మంత్రి అప్పలరాజుకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో తరువాత ఏం జరుగుతుందో అని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇన్నాళ్లూ మంత్రి అప్పలరాజుకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పలాస నియోజకవర్గ సొంత పార్టీకు చెందిన అసమ్మతి నేతలకు.. పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్సీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మంత్రి అప్పలరాజుపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేస్తూ, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారిని.. దువ్వాడ హేంబాబు చౌదరి, దువ్వాడ శ్రీకాంత్, జుత్తు నీలకంఠంలను.. పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ.. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్కి లేఖ రాశారు. శ్రీకాకుళం జిల్లా పలాస వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాట్లాడిన నేతలు.. ఆ ముగ్గుర్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా గత కొంత కాలంగా మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆయన నియోజకవర్గం పలాసలో అడుగడుగునా అసమ్మతి ఎదురవుతోంది. తనకు మున్సిపల్ ఛైర్మన్ పదవి రాకుండా చేశారని పలాసలో కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్, వజ్రపుకొత్తూరు పీఏసీఎస్ పదవి ఇచ్చినట్లే ఇచ్చి లాగేశారని సొసైటీ మాజీ అధ్యక్షుడు దువ్వాడ హేమబాబు చౌదరి, తనను ఎంపీపీ కాకుండా అడ్డుపడ్డారని మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు సోదరుడు జుత్తు నీలకంఠం మంత్రిపై గుర్రుగా ఉన్నారు.
వీరంతా కలిసి ఆయనకు వ్యతిరేక వర్గంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీరంతా సమావేశం నిర్వహించి మాకొద్దీ అప్పలరాజని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే గెలవనివ్వబోమని అల్టిమేటం జారీ చేశారు. మేం రాజకీయంగా బలపడితే తనకు ఇబ్బందనే మంత్రి మమ్మల్ని మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై ప్రస్తుతం చర్యలు తీసుకోవడం మరోసారి జిల్లా రాజకీయాలలో తీవ్ర చర్చకు తెరలేపాయి.
ఇవీ చదవండి: