కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలకు సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సాయాన్ని అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా... స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా పోటీ చేసేవారు గుంపులుగా వెళ్లి నగదు, వస్తువులు పంచుతూ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి అత్యవసరం కోసం వచ్చే సామాన్యులను చావ బాదుతున్న పోలీసులకు వందల మందితో రోడ్డెక్కుతున్న వైకాపా నేతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేసినా... అక్రమాలకు పాల్పడినట్టు రుజువైనా వారిపై అనర్హత వేటేసి, గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తామని సీఎం జగనే ఆర్డినెన్స్ తెచ్చారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. కరోనా సాయం పంపిణీ పేరుతో వైకాపా నేతలు, అభ్యర్థులు పాల్పడుతున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా సీఎం ముందుంచుతామని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ప్రకారం తక్షణమే వారిపై అనర్హత వేటెయ్యాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు