Janasena leader nadendla manohar comments: శ్రీకాకుళం జిల్లాలో గురువారం జనసేన పార్టీ ‘యువశక్తి’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. సభకు సంబంధించి.. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలోని తాళ్లవలస వద్ద దాదాపు 35 ఎకరాల ప్రైవేటు స్థలంలో యువశక్తి సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సభా వేదికకు 'వివేకానంద వికాస' వేదికగా నామకరణం చేశామన్నారు.
అనంతరం సభ ముఖ్య ఉద్దేశ్యాన్ని ఆయన వివరించారు. యువత సమస్యలపై చర్చించి, యువతను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడుతున్న శక్తులపై అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్న తీరును ప్రజలకు ఆ సభ ద్వారా తెలియజేస్తామన్నారు. వర్తమాన రాజకీయాల్లో ఈ ‘యువశక్తి’ కార్యక్రమంతో పెద్ద మార్పును తీసుకురాబోతున్నామని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు.
‘యువశక్తి’ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను, సభాస్థలిని ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించారు. ఉత్తరాంధ్రలో ఇదే భారీ బహిరంగ సభ అవుతుందని, యువతకు భరోసానివ్వడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ 12న జిల్లాకు విచ్చేస్తున్నారన్నారు.
ఇవీ చదవండి