Irregularities in Jagananna land distribution : అధికార పార్టీ కార్యకర్తలైతే చాలు.. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు అర్హులు అన్నట్లు మార్చేశారు కొందరు అధికారులు. సంక్షేమ పథకాల్లో సింహభాగాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు సిఫార్సు చేసిన వారికే వర్తింపజేస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. జగనన్న భూపంపిణీ కార్యక్రమంలో నిబంధనలు పక్కపెట్టి.. వైఎస్సార్సీపీ నాయకుడికి సాగు భూమి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సంవత్సరాలు తరబడి అదేభూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు కాకుండా ఇతరులకు ఎలా పట్టాలు ఇస్తారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ శాసనసభ్యుడి ఆదేశాలు అమలు.. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూపంపిణీ అంటూ ప్రభుత్వ భూములను తమపార్టీ నాయకులు, కార్యకర్తలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. నిబంధనల ప్రకారం సాగులో ఉన్న భూమిలేని రైతులకే గరిష్టంగా రెండెకరాల వరకు భూమిని పంపిణీ చేయాలి. నిబంధనలకు లోబడి సాగుకు అనువైన వాటిని మాత్రమే అర్హులైన రైతులకు అందించాలి. కానీ, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం అధికారుల నిబంధనలు పక్కన పెట్టేశారు. అధికార పార్టీ శాసనసభ్యుడి ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబానికి సాగు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
రాత్రికి రాత్రే భూమి చదును.. కదిరి మండల పరిధిలోని పట్నం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 1382లో సుమారు 42ఎకరానికి పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి చుట్టూ చిన్న, సన్నకారు రైతులు భూమిని చదును చేసుకుని సాగు చేసుకుంటున్నారు. భూపంపిణీ ప్రకటన వినగానే సాగుచేసుకుంటున్న రైతులు సాగులో ఉన్న భూమికి పట్టాలు ఇవ్వాలని కోరారు. సదరు భూమి అటవీశాఖకు కేటాయించినందున ఆభూమికి సాగు పట్టాలు ఇవ్వడానికి వీలుకాదని తేల్చిచెప్పారు. నిబంధనల మేరకు పట్టాలు పొందడానికి వీల్లేదని రైతులు మిన్నకుండిపోయారు. అటవీశాఖ పరిధిలో ఉందని చెప్పిన అధికారులే ఆభూమిలో సాగు పట్టాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఎమ్మెల్యే సిఫార్సు మేరకు పట్నం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడికి సాగు పట్టాను సిద్ధం చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. రాత్రికి రాత్రే గుట్టను హిటాచీ సాయంతో అధికార పార్టీ నాయకుడు చదును చేసేశాడు. విషయం తెలుసుకుని సాగులో ఉన్న రైతులు అవాక్కయ్యారు. రైతులు ఆభూమిలోకి వెళ్లి చదును పనులను అడ్డుకున్నారు. సాగులో లేని వ్యక్తికి భూమి ఎలా ఇస్తారంటూ అధికారులను నిలదీశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ ప్రభుత్వ భూమిలో బైఠాయించి నిరసన తెలిపారు.
నిబంధనలు అమలు చేస్తూ అర్హులకు భూమిని పంపిణీ చేయాల్సిన అధికారులే అనర్హులకు అప్పగించేందుకు సిద్ధమైతే తమపరిస్థితేంటని మహిళారైతులు నిలదీస్తున్నారు. సర్వేనంబరు 1382 చుట్టూ 20మందికిపైగా రైతులు ఉన్నారు. వీరందరూ చిన్న, సన్నకారు రైతులే. సంవత్సరాలుగా భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని తమకు కాకుండా ఇతరులకు ఎలా పట్టాలు ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు నిబంధనలకు అనుగుణంగా అర్హులకే పట్టాలు ఇవ్వాలి. రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి అనర్హులకు పంపిణీ చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.