శ్రీ సత్యసాయి జిల్లాలో దొంగల ముఠా బెంబేలెత్తిస్తోంది. వరస చోరీలతో హడలెత్తిస్తోంది. పగటి సమయంలో రెక్కీ నిర్వహిస్తూ రాత్రిళ్లు లూఠీలకు పాల్పడుతోంది. పలుచోట్ల పట్టపగలు సైతం చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతోంది.
నియోజకవర్గంలో గత రెండు నెలలుగా దొంగల ముఠా తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నాయి. మరోవైపు.. హంద్రీనీవా కాల్వల్లో గుర్తుతెలియని శవాలు తేలుతున్నాయి. నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒకచోట నేరాలు జరుగుతున్నా.. కట్టడి చేయడంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రెండు నెలలుగా తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ లూటీలు చేస్తున్న దొంగల ముఠా ఈసారి కొత్త ఎత్తుగడ వేసింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గంగులవాయిపాల్యం గ్రామంలో గురువారం రాత్రి దేవీ మహత్మ్యం నాటకం ప్రదర్శించారు. ప్రదర్శను తిలకించేందుకు గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. అదే అదునుగా భావించిన దొంగల ముఠా.. 8 ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడింది. నాటకం అనంతరం ఇళ్లకు చేరుకున్న బాధితులు తలుపులు తెరిచి.. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్ద మొత్తంలో డబ్బు, లక్షలు విలువ చేసే బంగారు దోచుకెళ్లినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.
నియోజకవర్గంలో రెండు నెలలుగా వరుస చోరీలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. పోలీసులు ఇప్పటికైనా స్పందించి చోరీలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి :