Villagers Fight For Their Right to Vote in AP : 2006 నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటిని నిల్వచేయటం ప్రారంభించారు. ఏటా 5 TMCల నీటిని నిల్వ చేసేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక 2020లో ఈ రిజర్వాయ్లో సామర్థ్యం మేరకు 10 TMC నిల్వ చేయాలని నిర్ణయించారు. దీంతో రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
Two Villages Have Been Fighting for the Right to Vote for Three Years : దీనిలో శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని సీసీ రేవు, మర్రిమాకులపల్లి గ్రామాలూ ఉన్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను మరో ప్రదేశానికి తరలించారు. అయితే బాధితుల్లో కొందరికి మాత్రమే పరిహారం, పునరావాస ప్యాకేజీ ఇచ్చి2020 అక్టోబర్‌లో అందర్నీ గ్రామం ఖాళీ చేయించి.. ఇళ్లు కూల్చేసి, నీటిని వదిలారు. దీంతో ప్రజలు అప్పటికప్పుడు తరలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వం వారికి పునరావాసం గురించి పట్టించుకోలేదు. దీంతో మర్రిమాకుల పల్లి, సీసీ రేవు వాసులు సొంతంగా గ్రామాన్ని నిర్మించుకున్నారు. అయితే ఇప్పటికీ అధికారులు వారికి ఓటు హక్కు కల్పించలేదు.
'ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ఓటు హక్కు రద్దు'
సీసీరేవు గ్రామ పంచాయతీలోని మర్రిమాకుల పల్లి, సీసీ రేవు గ్రామాలు ముంపునకు గురయ్యాక ప్రభుత్వం కొత్తగా పంచాయతీని గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి గ్రామాలకు గుర్తింపు రానీయకుండా అడ్డుపడుతున్నారని ఓటు హక్కు కల్పించే కొత్త జాబితా సిద్ధం చేయకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మర్రిమాకుల పల్లిలో 16 వందల ఓటర్లు ఉండగా సీసీ రేవులో 3 వందల 60 వరకు ఓటర్లు ఉన్నారు.
చాలా మంది ఇళ్లు, పొలాలు కోల్పోయి గ్రామాన్ని వదిలిపోవడంతో ప్రస్తుతం రెండు గ్రామాల్లో 15 వందల నుంచి 16 వందల వరకు ఓటర్లు ఉన్నట్లు అంచనా. రెండు గ్రామాల ప్రజలు పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించకోలేకపోయారు. అప్పటి నుంచి ఓటు హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. మూడేళ్లుగా పోరాటం చేస్తున్నా అధికారులెవ్వరూ పట్టించుకోవట్లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు సార్లు కలెక్టర్ కలిసిన ఫలితం దక్కలేదని వాపోయారు.
ఓటు హక్కు కోసం గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయడంతో ఈ ఏడాది మార్చిలో గ్రామసభ నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన గ్రామాలకు ఏ పేరు పెట్టాలంటూ గ్రామస్థుల నుంచి అభిప్రాయం తీసుకున్న జిల్లా పంచాయతీ అధికారులు నివేదికను మే నెలలో కలెక్టర్‌కు సమర్పించారు. గ్రామాలకు పాత పేర్లనే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ ఐదు నెలలుగా కలెక్టర్ గ్రామాలను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఓటు హక్కు కోసం తాము ఎన్ని రోజులు వేచి చూడాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటు ప్రాధాన్యత పదే పదే చెప్పే అధికారులు తమకు ఓటు హక్కు కల్పించకపోవడంపై గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సమయానికైనా ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు.