Stones Prasadam: ఎవరైనా దైవ దర్శనానికి వెళ్తే పూలు, పండ్లు, టెంకాయలు తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ బట్ట భైరవేశ్వర స్వామి వారికి గులకరాళ్లను నైవేథ్యంగా సమర్పిస్తారు. మొక్కులు తీర్చుకోటానికి వచ్చిన భక్తులు వేసిన గులకరాళ్లతో చిన్న గుట్ట ఏర్పడింది. తమ గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు సైతం వచ్చి బట్టభైరవేశ్వర స్వామిని దర్శించుకుంటారని.. ఎలాంటి ఆపదలు రాకుండా స్వామివారు తమను కాపాడుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
గులకరాళ్ల సమర్పణ: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామం అది. ఆ ఊరి పొలిమేరలో వెలసిన బట్ట భైరవేశ్వర స్వామి అంటే చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో విశ్వాసం. ఊరుదాటి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాదు ఐదు గులకరాళ్లు బట్టభైరవేశ్వరుడికి సమర్పిస్తారు. ఇలా చేస్తే సకల శుభాలూ కలుగుతాయని వారి విశ్వాసం.
ఎన్నో ఏళ్లుగా సాగుతోన్న ఆచారం : పండగల రోజున ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఇలా వజ్రాల కోసం వెతికినట్లు గులకరాళ్ల కోసం భక్తులు అన్వేషిస్తారు. మనసులో గట్టి కోర్కెలు కోరుకుని స్వామివారిగుడి వద్ద ఉంచుతారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అంటున్నారు గ్రామస్థులు. అందుకే ఎన్నో ఏళ్లుగా నైవేద్యంగా సమర్పించిన రాళ్ల గుట్టను ఇప్పుడు కదిలించేందుకు ఎవరూ సాహసించరని చెప్తున్నారు. ఆ ఊరి ఆడపడుచులే కాదు.. కొత్తగా వచ్చిన కోడళ్లూ ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు.
ఇదీ చదవండి: KGF Hero: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజీఎఫ్ "హీరో"