CM Jagan Tweet on Chikkaballapur Road Accident: పొట్ట చేత పట్టుకొని కర్ణాటకకు వెళ్లిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దసరా పండగ, సీమంతం, కుమారుడు జన్మించాడని ఇలా ఒక్కొక్కరు ఒక్కో సంద్భరంలో సొంతూళ్లకు వచ్చి తిరుగు ప్రయాణమైన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. తెల్లవారుజామున కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో శ్రీసత్యసాయి జిల్లాకి చెందిన 10మంది, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
గవర్నర్ ఎస్. అబ్దుల్‌నజీర్: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపూర్ 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై ప్రముఖులు స్పందించారు. ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిసరాలకు చెందిన 13 మంది వలస కూలీలు మృతి చెందడంపై గవర్నర్ ఎస్. అబ్దుల్‌నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని ప్రకటించారు.
సీఎం జగన్: కర్ణాటకలోని చిక్‌బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాద్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నట్లు తెలిపారు.
నారా లోకేశ్: వలస కార్మికుల మృతి బాధాకరమని.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. మృతులంతా వ్యవసాయ కూలీలే కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్: రోడ్డు ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు చెందిన వీరిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని... తగినంత నష్ట పరిహారం అందించాలని కోరారు. ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తమ ప్రాంతంలోనే వారికి ఉపాధి అవకాశాలు లభించి ఉంటే పొరుగు రాష్ట్రాలకు వలసపోయే అవసరం ఉండేది కాదని పపవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
దగ్గుబాటి పురందేశ్వరి: రోడ్డు ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మృతదేహాలకు త్వరగా శవపంచనామా నిర్వహించి వెంటనే వారి కుటుంబ సభ్యులకు అందజేసేలా కర్ణాటక, ఆంధ్ర అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరారు. మృతులంతా రోజు వారి కూలీ జీవనం సాగించేవారు కావడంతో వారి కుటుంబాలకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన రీతిలో ఆర్థిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
కాల్వ శ్రీనివాసులు: కర్ణాటకలో చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వలస కూలీల మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఇవి జగన్ రెడ్డి ప్రభుత్వ హత్యలని మండిపడ్డారు. చనిపోయిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జగన్ రెడ్డి ఛోద్యం చూస్తున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, ఉపాధి దొరకక, గత్యంతరం లేక నిరుద్యోగులు, కూలీలు ఇతర రాష్ట్రాలకు పొట్ట కూటి కోసం వలస వెళ్లి జీవనోపాధిని పొందుతున్నారని తెలిపారు.
Karnataka Accident Today : లారీని ఢీకొన్న టాటా సుమో.. 13 మంది ఏపీ వాసులు మృతి