వ్యవసాయం, భర్త అనారోగ్యం, కుటుంబ ఖర్చులకు చేసిన అప్పులు తీర్చే దారి లేక ఓ మహిళ పొలంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెంలో జరిగింది.
గ్రామంలో కరిచేటి రమాదేవి(55), వెంకట్రావు దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రావు అనారోగ్యానికి గురికాగా.. ఆయనకు వైద్యం చేయించడానికి, పొలం పనులకు, ఇతరత్రా ఖర్చులకు రుణాలు చేశారు. వెంకట్రావు ఆరోగ్యం విషమించి ఆరునెలల క్రితం కన్నుమూశాడు. తనకున్న రెండెకరాల భూమిని అమ్మి రుణాలు తీర్చేయాలని రమాదేవి నిర్ణయించుకుంది. అది విక్రయించినా అప్పులకు సరిపడా నగదు రాదని తెలిసి సొంత పొలంలో విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కల రైతులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆమె కుమారుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మార్టూరు జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి