ప్రకాశం జిల్లా పొన్నలూరులో దారుణం జరిగింది. దుర్వ్యసనాలు, వేధింపులు తట్టుకోలేక నర్సింగరావు అనే వ్యక్తిని.. కన్న తల్లే కిరాయి గూండాలతో హత్య చేయించింది. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వేధింపులు తాళలేకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. పొన్నలూరుకు చెందిన నర్సింగరావు నాలుగు నెలల క్రితం హత్యకు గురయ్యాడు. కందుకూరు మండలం దూబగుంట వద్ద దుండగులు వ్యక్తిని హత్య చేసి పూడ్చి పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పొన్నలూరులో ఉన్న నర్సింగరావు తల్లి లక్ష్మమ్మను ప్రశ్నిస్తే.. తన కుమారుడు హైదరాబాద్ కూలీ పనులకు వెళ్లాడని.. అతనికి ఫోన్ కూడా లేదని పోలీసులను నమ్మించింది. ఆమె బంధువులు, చుట్టుప్రక్కల గ్రామాల్లో రౌడీ షీటర్లపై నిఘా ఉంచిన పోలీసులు కేసును ఛేదించారు. నర్సింగరావు దుర్వ్యసనాలకు బానిసై తల్లిని వేధించడం వల్లే.. లక్ష్మమ్మ కుమారుణ్ని హతమార్చాలని భావించింది. హత్య చేయడానికి రౌడీ షీటర్లతో రూ.1.70 లక్షలతో సుపారీ కుదుర్చుకున్నారు. అందులో రూ.50 వేలు చెల్లించారు. నర్సింగరావుకు మద్యం తాగించి దూబగుంటకు తీసుకెళ్లి నరికి చంపి.. పూడ్చిపెట్టారు. మిగిలిన డబ్బు కోసం తేడా రావడం వల్ల హత్య వ్యవహారం బయటపడింది. ఈ కేసులో తల్లి సహా మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ తెలిపారు.
ఇదీ చూడండి..