ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్లో లోపాలు, వారి సమస్యలను పరిష్కరించాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేశాయి. ఉపాధ్యాయ కౌన్సిలింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని, వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మెన్యువల్లో కౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐక్య ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా లో 10శాతం మేర పోస్టులు బ్లాక్ చేశారని, వీటిని తెరిచి ఖాళీల లిస్ట్లు జత చేయాలని డిమాండు చేస్తూ నిరసనలు చేపట్టారు. నిరసనకు అనుమతించిన సమయం పూర్తయిందని, బయటకు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించినా , సమస్యపై ఆందోళన కొనసాగించారు. వారిని పోలీసులు బయటకు లాగే ప్రయత్నంలో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇరూ వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కొంతమంది ఉపాధ్యాయులను పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలో టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డీఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయుల బదిలీలలో న్యాయం జరగడం లేదన్నారు.
ఇదీ చదవండి: ఏలూరు వింత వ్యాధి ఘటనలో మూడుకు చేరిన మృతులు