వెలిగొండను అధికారిక ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్చాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేసం నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు. సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రకాశం జిల్లా ప్రజానీకం, రైతులు ఏళ్ల తరబడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్‌లో వెలిగొండను అనుమతుల్లేని ప్రాజెక్టుగా చూపించడంపై అభ్యంతరం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న, పూర్తయిన 5 ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టంలో ఉన్నట్టు గెజిట్లో పొందుపర్చారని.. ఇది విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్, సెక్షన్ 85 (7E)లో హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు-నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడును ప్రస్తావించారని గుర్తు చేశారు. విభజన చట్టంలోని జాబితా నుంచి వెలిగొండను తొలగించి.. అనుమతిలేని ప్రాజెక్టుగా చూపించడం అన్యాయమన్నారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న 50 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటని, కరవు కాటకాలతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టుని వెంటనే కేంద్రం గెజిట్లో చేర్చాలని, నేరుగా సమస్యను విన్నవించేందుకు సమయం కేటాయించాలని కోరారు.
ఇదీ చదవండీ.. ఆధార్-ఈకేవైసీతో కష్టాలు.. అనుసంధాన కేంద్రాల వద్ద పడిగాపులు