రాష్ట్రమంతా కరోనాపై పోరాడుతుంటే నాటు సారా విక్రయాలు మాత్రం చాప కింద నీరులా జరుగుతున్నాయి. గ్రామాల్లో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి విపరీతంగా ఉంది.
అటవీ సమీప పల్లెల్లో...
గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి తదితర నియోజకవర్గాల్లోని అటవీ సమీప పల్లెల్లో సారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కారణంగా.. ప్రశాంతతకు మారుపేరైన గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లి, ఇందిరానగర్ కాలనీ, మాగుటూరు, గన్నేపల్లి, బొమ్మిలింగం, కాకర్ల గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. మాగుటూరు తండా, కాకర్ల, గన్నేపల్లి, యాచవరం శివారులతో పాటు పాపినేనిపల్లిలో గ్రామ నడిబొడ్డున సారా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. గిద్దలూరు మండలంలోని సుగాలి తండా, దిగువమెట్ట తదితర గ్రామాల్లో విక్రయాలు సాగుతున్నాయి. కొమరోలు, రాచర్ల, బేస్తవారపేట మండలాల్లోని ఇదే తంతు కొనసాగుతోంది. సారాను నిర్మూలించాల్సిన ఆబ్కారీ శాఖాధికారులు కరోనా బందోబస్తులో ఉన్న కారణంగా.. పరిస్థితి చేజారుతోంది. ఇకనైనా పోలీసులు, ఆబ్కారీ అధికారులు స్పందించి గ్రామాల్లో సారాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బందోబస్తు విధుల్లో...
కరోనా నేపథ్యంలో ఆబ్కారీ శాఖాధికారులు, సిబ్బంది అందరూ రహదారి బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఈ కారణంగా సారా తయారీ, విక్రయాలపై దృష్టి సారించలేక పోతున్నామని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో చరవాణి సిగ్నళ్లు లేని కారణంగా.. ఆ సమాచారమూ తెలియటం లేదని తెలిపారు. ఎక్కడైనా సారా అమ్మితే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఆబ్కారీశాఖ అధికారులకు సమాచారమివ్వాలని ఆబ్కారీశాఖ సీఐ రమేష్‌పేర్కొన్నారు.
ఇదీ చూడండి: