ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పల్లెపోగు విద్యాసాగరుడు అనే అధికారి తొమ్మిది నెలలు తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించారు. జూన్ 30 న పదవీ విరమణ చేయాల్సి ఉండగా... ఆ సమయంలో మండలంలోని వీఆర్వోలు, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ల సహాయంతో 20 రోజుల వ్యవధిలో 387.89 ఎకరాల ప్రభుత్వ భూములను ఆన్లైన్ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విచారణ జరిపించగా... అక్రమాలు నిజమేనని నిర్ధరణ అయింది.
విచారణలో భాగంగా ఒక ఆర్ఐ, ఒక విలేజ్ సర్వేయర్, 13 మంది వీఆర్వోలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్‌ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడ్డ తహసీల్దార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఫలితంగా విశ్రాంత తహసీల్దార్ విద్యాసాగరుడుపై ఐపీసీ 409, 467, 468, 477 (ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒంగోలులో ఉన్న విద్యాసాగరుడు అదుపులోకి తీసుకొని మార్కాపురం తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. ఈ భూముల పరాధీనంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న అంశంపై విచారణ జరుగుతోందని వెల్లడించారు.
ఇదీ చదవండీ.. land scam: భూఅక్రమాలకు పాల్పడిన 12 మంది రెవెన్యూ అధికారులు సస్పెండ్