ప్రకాశం జిల్లా మార్కాపురంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా తిరుమల తరహాలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి సూర్యప్రభ వాహనంతో ఉత్సవాలు ప్రారంభమై.. చంద్ర ప్రభ వాహనంలో ముగుస్తాయి. సాయంత్రం 6 గంటలకు వెండి రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనిమిస్తారు. ఈ క్రమంలో.. ఉదయం నుంచి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. శేష వాహనంపై ఊరేగిన స్వామి వారిని దర్శించుకునేందుకు పుర వీధుల్లో భక్తులు పోటెత్తారు. వాహనసేవలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి 8 వరకు సూర్యప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు.
చీరాలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. వీరరాఘవస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అనంతరం స్వామివారికి నగరోత్సవం చేశారు. అనంతరం పూజలు యధావిధిగా సూర్యభగవానుడికి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కనిగిరిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వెంకటేశ్వర దేవస్థానం నుంచి ఊరేగింపుగా ఏడు వాహనాలపై ఏడు ప్రత్యేక దేవతామూర్తులను ఏర్పాటుచేశారు. కోలాటాలు పండరి భజనల మధ్య కనిగిరి పట్టణంలోని వీధుల్లో ఊరేగింపుగా ప్రజలకు దర్శనమిస్తున్నారు.
రథసప్తమి సందర్భంగా అద్దంకి పట్టణంలో స్థానిక మాధవ స్వామి దేవాలయంలో గో పూజ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొని గోమాతకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు జవ్వాజి నాగమల్లి ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు నిర్వహించారు.
ఇదీ చదవండి: