ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లాపాలేనికి చెందిన సుమారు 80 కుటుంబాలు చెరకు కోతల పనులకు తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాకు వెళ్లాయి. అక్కడ పనులు ముగించుకొని స్వస్థలాలకు బయల్దేరే సమయానికి లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో వారందరూ తమిళనాట చిక్కుకుపోయారు. సరైన వసతి లేక గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కనిగిరి, కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లోని పీసీపల్లి, లింగనపాలెం, చుండి, అన్నెబోయినపల్లి, తిమ్మపాలెం తదితర గ్రామాలకు చెందిన సుమారు వందకు పైగా వలస కూలీల కుటుంబాలు కడప జిల్లా రైల్వేకోడూరులో చిక్కుకుపోయాయి. వారికి కడప ఇంటెలిజెన్స్ డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ ఆనందరావు, విశ్రాంత ఎస్సై ఆంజనేయులు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మండ్ల అమర్‌నాథ్ తదితరులు తమ వంతుగా భోజన వసతి కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టరు స్పందించి తమను స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చీమకుర్తి, రామతీర్థం, మర్రిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పని చేసే ఇతర రాష్ట్రాల కార్మికులు స్వస్థలాలకు తరలి పోవాలనే ఆలోచనలో ఉన్నారు. గ్రానైట్ క్వారీలు, అనుబంధ పరిశ్రమల్లో మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, బిహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు వేల మంది పని చేస్తున్నారు. చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెం తదితర ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికుల సంఖ్య సుమారు 5 వేల మంది ఉండొచ్చని అంచనా. లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులంతా గదులకే పరిమితం అవుతున్నారు. వీరంతా ప్రస్తుతం స్వస్థలాలకు తరలి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో సమావేశమయ్యారు.
బహుదూరపు బాటసారులు
లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత దూరమైనా కాలి నడకనే నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్ గాజాపూర్‌కు చెందిన ప్యారేలాల్, ఉమారావ్‌లు చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతూరికి వెళ్లేందుకు కాలినడకనే ఎంచుకున్నారు. గత 8 రోజులుగా నడిచి సోమవారం ఒంగోలుకు చేరుకున్నారు. తాము ఇంకా 700 కి.మీ. నడవాల్సి ఉందని తెలిపారు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. దారి పొడువునా సేవా సంస్థలు, దాతలు పెట్టే భోజనంతో కడుపు నింపుకొంటూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: