New Twist in Woman Murder Case: ప్రకాశం జిల్లాలో దారుణ హత్యకు గురైన వివాహిత కోట రాధ కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య స్నేహితుడి పేరిట సిమ్ కొనుగోలు చేసి ఛాటింగ్ చేసిందీ తనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్ల్లెళ్లపాడు గ్రామ శివారులో కారుతో తొక్కించి.. వివాహితను దారుణంగా హతమార్చిన కేసు కొత్త మలుపు తిరిగింది. కోట రాధను ఆమె భర్తే కిరాతకంగా హతమార్చినట్లు సమాచారం. రాధ వద్ద అప్పు తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి డబ్బు ఇస్తాను రమ్మని నమ్మకంగా పిలిపించి హత్య చేసి ఉంటాడని తొలుత అనుమానించారు. అతని కోసం పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. ఆమె భర్త మోహన్‌రెడ్డే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలోని కోదాడలో రాధ అంత్యక్రియలు ముగిసిన వెంటనే భర్త మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లా సీఎస్ పురానికి తరలించారు.
రాధను ఆమె భర్త మోహన్‌రెడ్డే మరికొందరితో కలిసి హత్య చేసినట్టు పోలీసులు ధ్రువీకరించుకున్నట్టు తెలిసింది. రాధ చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డికి ఇచ్చిన 80 లక్షల అప్పు గురించి భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగాయి. దీంతోపాటు కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని మోహన్‌రెడ్డి అనుమానించాడు. కాశిరెడ్డి పేరిట సిమ్ సైతం కొనుగోలు చేసి ఆమెతో ఛాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులిస్తామని అతని పేరుతోనే సందేశం పంపి తీరా ఆమె వచ్చిన తర్వాత కిరాతకంగా హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాధ తల్లిదండ్రులు కోరారు.
రాధ హత్య ఉదంతంలో తొలుత కాశిరెడ్డి ప్రమేయంపై అనుమానించిన పోలీసుల..భర్త మోహన్‌రెడ్డిపైనా నిఘా ఉంచారు. కనిగిరిలో రాధను తీసుకెళ్లి కారు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భార్య చనిపోయిన తర్వాత మోహన్‌రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో..అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: