ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే జనం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
మార్కాపురం:
పురపాలక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 35 వార్డులు ఉండగా 5 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 30 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి 60 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల, రెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు అధిక సంఖ్యలో జనం ఓటు వేసేందుకు తరలివస్తున్నారు.
చీరాల
చీరాల మున్సిపాలిటీలో 33 వార్డుల్లో మూడు ఏకగ్రీవం కాగా.. 30 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. హరిప్రసాద్ నగర్లో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కనిగిరి
కనిగిరి నగర పంచాయతీలో 13 వార్డులు గాను 26 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. కనిగిరి లోని పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ భార్గవి తేజ్ పరిశీలించారు. ఉదయం 9:30గంటల వరకు 20 శాతం ఓటింగ్ జరిగిందని ఆయన తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరి ఉండగా... మరికొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర బారికేడ్లు, పోలింగ్ సిబ్బంది తప్ప ఓటర్లు కనిపించని పరిస్థితి ఉంది.
అద్దంకి
నగర పంచాయతీలో ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్లు తమ ఓటుని వినియోగించుకునేందుకు కేంద్రాల దగ్గర బారులు తీరారు. మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల సమయానికి 20.26℅ పోలింగ్ నమోదైంది. దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా భయబ్రాంతులకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
16 వ వార్డులో అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పోలింగ్ కేంద్రాలు సందర్శించి.. ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
గిద్దలూరు పట్టణంలో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. పెర్ణమిట్ట పోలింగ్ కేంద్రాల్లో ప్రచారం చేస్తున్న వైకాపా ,సీపీఐ అభ్యర్థులను పోలీస్ సిబ్బంది బయటకి పంపించారు.
ఇదీ చదవండి: