Car accident in Gachibowli: కారులో వేగంగా రోడ్డుపై నిల్వ ఉన్న నీటిలోంచి వెళ్లడంతో పక్కనుంచి వెళుతున్న ద్విచక్రవాహనదారులపై ఆ నీరు పడింది. అలా ఎందుకు చేశావంటూ ప్రశ్నించినందుకు ఆగ్రహోదగ్రుడైన కారు నడిపే వ్యక్తి.. రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. దీంతో ఓ మహిళ తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గచ్చిబౌలి ఏఐజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ ఎం.మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డకు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ (27) వ్యాపారం చేస్తుంటారు.
ప్రశ్నించడమే ఆయన చేసిన పాపం: ఈ నెల 18న అర్ధరాత్రి 1.30 సమయంలో.. ఆయన తన భార్య మారియా మీర్(25), వరుసకు సోదరులయ్యే సయ్యద్ మిరాజుద్దీన్(24), రాషెద్ మాషా ఉద్దీన్(19)తో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై ఎర్రగడ్డ నుంచి మాదాపూర్ తీగల వంతెన మీదుగా గచ్చిబౌలికి బయలుదేరారు. ఏఐజీ సమీపంలోకి రాగానే, బెంజ్ కారులో వెళ్తున్న జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి రాజసింహారెడ్డి(26) అక్కడి రోడ్డుపై ఉన్న నీటిలో నుంచి దూసుకెళ్లడంతో సైఫుద్దీన్ సోదరులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై ఆ నీరు పడింది. దీంతో వారు కారు డ్రైవర్‌ను వెంబడించి.. అలా ఎందుకు చేశావని, కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళుతున్నావంటూ నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహించిన రాజసింహారెడ్డి వారిని కారుతో ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. దీన్ని గమనించిన సైఫుద్దీన్, మారియాలు వెంటపడి.. కారు డ్రైవర్ ఆగడాలపై ప్రశ్నించారు. మళ్లీ వారిని ఢీకొట్టాడు. దీంతో మారియా వాహనంపై నుంచి ఎగిరి కొద్దిదూరంలో పడి తీవ్ర గాయాలకు గురైంది. మారియా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మారియాకు 8 నెలల పాప ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: