ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది సాగర్ కాలువ దిగువన ఆరుతడి పంటలే వేసుకోవాలని, మాగాణి పంటకు తాము భరోసా ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సాగునీటి సమస్యలపై ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ నుంచి ఎంతమేరకు నీరు వస్తుందో కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అయితే ప్రకాశం జిల్లా వాటా క్రింద 42.2 టీఎంసీలు నీళ్లు రావాలంటే 54 టీఎంసీలు విడిచిపెట్టాలని తెలిపారు. అందువల్ల అదనంగా ఈ 12 టీఎంసీల నీటి కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని మంత్రులు పేర్కొన్నారు. అదనపు నీటి వాటా కోసం కృష్ణా బోర్డుకు లేఖ రాసేందుకు తీర్మానం చేశారు. సాగర్‌లో నీటి లభ్యతను అనుసరించి రైతులు మాత్రం ఆరుతడి పండలే వేసుకోవాలని వీరు సూచించారు.
ఎమ్మెల్యే ఆగ్రహం
జిల్లా అధికారుల తీరుపై సమావేశంలో కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.'' జిల్లాలో సాగర్ ఆయకట్టు తప్పా.. మిగతా ప్రాంతాల్లో సాగు లేదనుకుంటున్నారా? సోమశిల నుంచి రాళ్లపాడు రిజర్వాయర్‌కు నీరు విడిచిపెట్టే ఆలోచనలేదా?.. అసలు ఇతర ప్రాంతాల గురించి అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదు" అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి కలెక్టర్ పోలా భాస్కర్ సమాధానమిస్తూ అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యతతో సాగునీటి పనులు చేపడుతున్నామని, అయితే ప్రస్తుతం సాగర్ నీటి అంశం కీలకం కాబట్టి చర్చ సాగిందని వివరించారు.