ప్రకాశం జిల్లా ఇడుపూరులో ఇంటర్ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. దీంతో డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో సహా పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాల ప్రకారం.. మార్కాపురం మండలంలోని ఇడుపూరు గ్రామానికి చెందిన షేక్ మున్నా - నాసర్‌బీ దంపతుల కుమారుడు నాసర్‌వలీ పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం కూడా ఇంటికీ రాకపోవడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు మార్కాపురం గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పెద్దగా స్పందించలేదు.
బుధవారం రాత్రి నాసర్‌వలీ చరవాణి నుంచి స్నేహితుల ఫోన్లకు సందేశాలు వచ్చాయి. రూ. 5 లక్షలు చెల్లించాలని అందులో డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన డీఎస్పీ కిషోర్‌కుమార్, సీఐ ఆంజనేయరెడ్డి, మార్కాపురం గ్రామీణ ఎస్సై ఆర్.సుమన్‌తో పాటు సిబ్బంది ఇడుపూరు గ్రామానికి చేరుకోని విచారణ చేపడుతున్నారు. అదృశ్యమైన విద్యార్థి స్నేహితులతో పాటు గ్రామస్థులను విచారించారు.