ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు కొండారెడ్డి లక్ష్మిరెడ్డి రాళ్ల భూమిలో రతనాల పంట పండిస్తున్నారు. హైదరాబాదులో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేసేందుకు పల్లె సీమకు వచ్చారు. రాళ్లు రప్పలు పిచ్చి చెట్లతో నిండిన బీడు భూముల్ని చదును చేసి సాగులోకి తెచ్చారు. తనకు ఉన్నటువంటి భూమి ఏ పంటకు సరిపోతుందో తెలుసుకుని దానికి తగిన విధంగా చర్యలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదిగాడు కొండా రెడ్డి లక్ష్మి రెడ్డి, తండ్రి అనుభవం పాఠాలను మేధస్సుకు జోడించి రాళ్ల భూమిని పంట భూమిగా చేశాడు.
తనకు ఉన్న 10 ఎకరాల భూమిని క్రేన్ సహాయంతో చదును చేయించి నీటి వసతి కోసం బోర్లు వేయించాడు. ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకునేందుకు డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాడు. తన భూమిలో జామ పంట సరైనదని తెలుసుకొని 'యాపిల్ జామ' అనే రకాన్ని ఎకరాకు 12 వందలు చొప్పున నాటించాడు.
"మొక్కలు ఎదిగి కాయ పక్వానికి రావడానికి 15 నెలల సమయం పడుతుంది. ఆ తరువాత ప్రతి సంవత్సరం రెండు కోతలుగా కాయలు వస్తాయి. కేజీకి ధర సుమారు 20 రూపాయలు ఉంటే రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక్కో మొక్క కొనుగోలు కూలి రూ.30 అవుతుంది. దీనికి తోడు ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఖర్చులు అన్నీ కలిపి 50 వేల రూపాయల వరకు అవుతుంది" -రైతు కొండా రెడ్డి లక్ష్మి రెడ్డి
ఒక ఎకరం సాగు చేయాలి అంటే ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని లక్ష్మి రెడ్డి అన్నారు. మొదటి సంవత్సరం మొక్కలు కొనుగోలు, నాటేందుకు అయ్యే ఖర్చులు అదనంగా ఉంటాయని చెప్పారు. తరువాతి మూడు సంవత్సరాలు ఆదాయ వనరులుగా ఈ జామ మొక్కలు ఉంటాయని తెలిపారు.