ప్రకాశం జిల్లా గిద్దలూరు నగరపంచాయితీ పీఆర్ కాలనీలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర హస్టల్ రూటే వేరు. ఇతర ప్రభుత్వ వసతి గృహాల్లో చాలామట్టుకు మనం లోనికి వెళ్లాలంటేనే భయపడిపోతుంటాం. ఇక్కడ మాత్రం.. పచ్చని ప్రకృతి మనల్ని కట్టిపడేస్తుంది.
రూపురేఖలు మార్చాడు...
పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ హాస్టల్కు.. 2015లో ఎకరా 16 సెంట్లు కేటాయించారు. అందులో 30 సెంట్ల విస్తీర్ణంలో గదులున్నాయి. మిగతా స్థలం సద్వినియోగంలో వసతి గృహ సంక్షేమ అధికారి విజయభాస్కర్ హరిత ముద్ర వేశారు. తాను బాధ్యతలు స్వీకరించేనాటికి ముళ్ల పొదలతో నిండిన హాస్టల్ ప్రాంగణం రూపు రేఖలను సంపూర్ణంగా మార్చేశారు.
సేంద్రీయ పద్ధతిలో సాగు...
ముందుగా... 700 మొక్కలు కొని విద్యార్థులతో నాటించారు. 80 సెంట్ల విస్తీర్ణంలో సుమారు 27 రకాల మొక్కలు పెంచారు. మామిడి, జామ, సీతాఫలం, దానిమ్మ, పనస, నేరేడు, కొబ్బరి, బొప్పాయి తదితర పండ్ల చెట్లు వేశారు. కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వాటిని పిల్లలకు భోజనంలో వడ్డిస్తారు. నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం కోసం విజయభాస్కర్.. ఇప్పటివరకూ దాదాపు లక్షన్నరవరకూ సొంత నిధులు ఖర్చు చేశారు.
తానెక్కడున్నా... చుట్టూ పచ్చదనమే...
విజయభాస్కర్ గతంలో అటవీశాఖలో పనిచేశారు. ఆ సమయంలో మొక్కలతో అనుబంధం ఏర్పడింది. ఈ కారణంగానే.. తాను ఎక్కడ పనిచేస్తున్నా చుట్టుపక్కల పచ్చదనం ఉండేలా చేస్తారు. వార్డెన్ విజయభాస్కర్ ఆసక్తితో, విద్యార్థుల ఉత్సాహంతో... ఈ వసతి గృహం నందన వనంలా మారింది. చిన్నారులకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పంచుతోంది.
ఇవీ చూడండి- ఈ ప్రభుత్వ పాఠశాల... ట్రిపుల్ ఐటీ ర్యాంకుల అడ్డా..!