Power outage in Andhra pradesh: కరవు జిల్లాగా పేరొందిన ప్రకాశం జిల్లాలో చెరువులు, జలాశయాలు చెప్పుకోదగ్గ స్థాయలో లేవు. ఎక్కువ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు భూగర్భ జలాల మీదే ఆధారపడుతున్నారు. ఆరుతడి పంటలు, ఉద్యాన పంటలు వేసుకని ఉన్న కాస్త నీటినీ మోటార్ల ద్వారా తోడుకుని సాగు చేసుకుంటున్నారు. రోజుకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారనే ఉద్దేశంతో.. మొక్కజొన్న, మిరప, కంద, సీమపెండలం, పసుపు, కూరగాయలు, చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కొత్తపట్నం మండలం తీర ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాలు పూర్తిగా బోర్ల మీదే ఆదారపడి సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతంలోవన్నీ ఇసుక నేలలు కావడంతో నిత్యం వాటికి తడి అందించాల్సిన పరిస్థితి ఉంది. నారు వేసినప్పుడు, పంట చేలో ఉన్నా.. నేల తడి ఆరకుండా చూసుకోవాలి. ఇప్పుడు రోజుకు నాలుగైదు గంటలకు మించి విద్యుత్ ఇవ్వకపోవడం.. అది కూడా నిరంతరాయంగా ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయిలో తడి ఇవ్వలేకపోతున్నారు. విద్యుత్ అధికారులను అడిగితే మరమ్మతులు చేస్తున్నాం, లోడ్ రిలీఫ్ వంటి కారణాలు చెబుతున్నారని రైతులు అంటున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం.. గిద్దలూరు మండలంలో చిరుధాన్యాలు, మొక్కజొన్న పంటలపనా ప్రభావం చూపుతోంది. అద్దంకి ప్రాంతంలో మిరప, పసుపు, మొక్కజొన్న పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
తెలగుదేశం హయాంలో మిగులు విద్యుత్‌తో నిరంతరరాయంగా సరఫరా చేశామని కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. మూడేళ్లు గడిచినా వైకాపా ప్రభుత్వం.. తమపై నెపం వేయడం సరికాదని విమర్శించారు. పంటలు చేతికొస్తున్న ఈ సమయంలో విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే దిగుబడులు పూర్తిగా పడిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: దుబాయ్ ఎక్స్‌పోలో ఆరు ఒప్పందాలు.. రూ.5,150 కోట్ల పెట్టుబడులు : మేకపాటి