పొలంలో దిగుబడి రాక.. చేసిన అప్పులు తీరక.. బలవంతంగా ఓ రైతన్న ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాద ఘటన.. ప్రకాశం జిల్లాలో జరిగింది. కారంచేడు గ్రామానికి చెందిన నాగాలం వెంకట గోపీనారాయణ (31) శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కొంతసేపటి తర్వాత బంధువుకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించారు. స్వర్ణ-చీరాల రోడ్డులోని నల్లకట్ట సమీపంలోని పొలంలో గోపీనారాయణ పురుగుమందు తాగి పడి ఉన్నట్లు గుర్తించారు. 108 వాహనంలో తీసుకెళుతుండగా దారిలో మృతి చెందినట్లు చీరాల ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. కారంచేడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
గోపీనారాయణకు సొంత పొలం లేకున్నా ఏటా కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు. గత ఏడాది 20 ఎకరాల్లో వరి, నాలుగున్నర ఎకరాల్లో మిర్చి సాగు చేయగా దాదాపు రూ.18 లక్షలు అప్పుల పాలైనట్లు ఫిర్యాదులో భార్య పేర్కొన్నారు. దళారి ద్వారా ధాన్యం అమ్మగా డబ్బులు రాలేదని, మిర్చి దిగుబడి రాక తీవ్ర నష్టం వాటిల్లినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలిపారు.
ఆ రైతుకు ఇద్దరు కుమార్తెలు (4, 6 ఏళ్ల వయస్సు) ఉన్నారు. భార్య భువనేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అహ్మద్‌జాని తెలిపారు. నాలుగు రోజుల క్రితం కారంచేడు మండలం ఆదిపూడికి చెందిన కౌలు రైతు కూడా పురుగుమందు తాగి పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం మరువకముందే మరో కౌలు రైతు సైతం ఆత్మహత్య చేసుకోవడం తోటి రైతుల్లో విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి:
సీఎం కుటుంబంపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో.. వ్యక్తి అరెస్ట్!