గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలు చదివే విద్యార్థులకు సమీప పాఠశాలకు వెళ్ళి రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సమయానికి బస్సులు ఉండవు.. ఆటోల్లో ప్రయాణించాలంటే డబ్బులుడాలి.. అంతేకాకుండా కిక్కిరిసిన ఆటోలో ప్రయాణం చేయాలి. దీనివల్ల విద్యార్థులకు ఆర్థిక భారంతో పాటు, ప్రమాదాలు జరుగుతాయనే భయం కూడా వెంటాడుతుంది. పేద విద్యార్థులు ఈ భారాన్ని భరించలేక మధ్యలోనే బడి మానేసిన సందర్భాలున్నాయి.
ఇలాంటి సమస్యను గుర్తించిన ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అనే ప్రవాసాంధ్రుల సంస్థ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైకిల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది. ఈ సైకిల్ బ్యాంకు ముఖ్యోద్దేశం.. పాఠశాలకు దూరం నుంచి వస్తున్న విద్యార్థులను ఎంపికి చేసి.. వారికి ఉచితంగా సైకిళ్లను అందజేస్తారు. వాటిని ఆ పాఠశాలలో చదివినంత కాలం ఆ విద్యార్థి వినియోగించుకోవచ్చు.
10వ తరగతి పూర్తయిన తరువాత మళ్ళీ ఆ సైకిల్‌ను పాఠశాలకు అప్పగిస్తారు. ఇదే సైకిల్‌ను మరో విద్యార్థికి ఇస్తారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధినేత గుళ్ళపల్లి శ్రీనివాసరావు సంస్థ తరుపున ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో డా. కొర్రపాటి సుధాకర్ సారధ్యం వహిస్తున్నారు. ఒకో పాఠశాలకు 20 నుంచి 30 సైకిళ్ళ వరకూ ఉచితంగా ఇచ్చారు. ఇప్పటివరకూ 31 పాఠశాలల్లో ఈ సైకిల్ బ్యాంకు నిర్వహిస్తున్నారు. మూడేళ్ళ నుంచి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. సైకిల్ బ్యాంక్ నిర్వహణతో విద్యార్థుల్లో డ్రాపౌట్స్ తగ్గాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.