ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 1,342 వాలంటీర్ల పోస్టులకు గత నెల 27 వరకూ ఇంటర్వ్యూలు జరిపారు. అన్నిరకాల పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ నెల 3న తుది జాబితాతో పాటు నియామక పత్రాల పంపిణీ ప్రారంభించారు. కొందరికి నియామక పత్రాలు అందజేసి.. మిగిలినవారికి ఇవ్వకుండా వాయిదా వేయడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. అన్నిరకాల పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనా.. తమ పేర్లు ఆ జాబితాలో ఉంటాయో.. లేవోనని ఆందోళన పడ్డారు. ఇవాళ 1,142 మందితో రెండో జాబితా ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఆ జాబితాలో చాలామంది పేర్లు గల్లంతయ్యాయి. రెండురోజుల కిందట తుది జాబితాలో తమ పేర్లు చూసుకున్న అభ్యర్థులు... ఇవాళ పేర్లు లేకపోవడంతో ఖంగుతిన్నారు.
తొలి జాబితాకు... రెండో జాబితాకూ చాలా వ్యత్యాసం ఉందని అభ్యర్థులంటున్నారు. సిఫార్సులు ఉన్నవాళ్లకే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. తమ పేర్లు తొలగించడానికి కారణాలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల ముందు ఉన్న పేర్లు... ఉన్నట్లుండి గల్లంతు కావడం అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తున్నారు. ఎంపిక చేసి తొలగించేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు, తర్వాత ఇంటర్వ్యూలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.