Everything is ready for sand movement in Gundlakamma: గుండ్లకమ్మలో 4 లక్షల టన్నుల ఇసుక కొల్లగొట్టడానికి సర్వం సిద్ధమైంది. అధికార పార్టీ నేతల జోక్యంతో చకచకా దస్త్రాలు కదిలాయి. ఉత్తర్వులు జారీ కావడమే మిగిలింది. ఆ తర్వాత తవ్వకాలకు విధివిధానాలు నిర్దేశిస్తారు. డ్రెడ్జర్ ద్వారా ఇసుకను తవ్వి తరలిస్తే జలాశయం దెబ్బతిని ఉనికికే ముప్పు వాటిల్లుతుందని.. రైతులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడులోని గుండ్లకమ్మ జలాశయం పరివాహకంలో భారీ స్థాయిలో ఇసుక తవ్వేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేత అండతో బాపట్ల జిల్లాకు చెందిన గుత్తేదారు.. ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఇటీవల భారీ డ్రెడ్జర్‌ను నదిలో దించారు. ఈ వ్యవహారంపై రెవెన్యూతోపాటు పోలీసు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. తమకు అనుమతులు ఉన్నాయంటూ వైకాపా కీలక నేత పేరు చెప్పి, కిందిస్థాయి అధికారులను అక్రమార్కులు హడలెత్తించారు. ఏకంగా పైపులు బిగించి ఇసుక తోడే ప్రయత్నాలు చేశారు. విమర్శలు రావడంతో ఈ దఫా అధికారికంగానే ప్రయత్నాలు ఆరంభించారు.
జేపీ వెంచర్స్ తరఫున ఇసుక తవ్వకానికి దరఖాస్తు చేశారు. గనులు, జల వనరులశాఖ అధికారులు పరిశీలించి.. ఇసుక తవ్వకాలపై సాధ్యాసాధ్యాలను తెలియజేయాలి. శరవేగంగా స్పందించిన అధికారులు.. ఏకంగా 4 లక్షల టన్నులు తవ్వుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అనుమతులు లేకుండా డ్రెడ్జర్‌ను దించినా నెలపాటు చర్యలు తీసుకోని అధికారులు.. ప్రైవేటు సంస్థ దరఖాస్తు చేసుకోవడంతో ఆగమేఘాలపై సానుకూల నివేదిక ఇవ్వడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. గుండ్లకమ్మ జలాశయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పూడిక తీయలేదని, ఇది 4 సెంటీమీటర్ల వరకు ఉంటుందని.. ఆ మేరకు తవ్వుకోవచ్చని సంకేతాలివ్వడం చర్చనీయాంశమైంది. జల వనరులశాఖ అధికారుల అంచనా ప్రకారం.. గుండ్లకమ్మ జలాశయం నుంచి మొత్తం 4 లక్షల టన్నులు ఇసుక తవ్వి తీయనున్నారు.
గుండ్లకమ్మ జలాశయం ప్రస్తుతం ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలో ఉంది. ఈమేరకు ఇసుక తవ్వకాలకు అనువుగా ఉన్న అంశాలపై నివేదికను రెండు జిల్లాల కలెక్టర్లకు, గనుల శాఖకు జల వనరుల శాఖ అందజేసింది. ఒక జిల్లా పరిధిలో తవ్వకాలకు అనుమతి ఇవ్వగా, మరో జిల్లా కలెక్టర్ ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే గనుల శాఖ డైరెక్టర్ నుంచి వచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా తవ్వకాలకు విధివిధానాలు నిర్దేశిస్తారు. ఈ స్థాయిలో ఇసుకను డ్రెడ్జర్ ద్వారా తవ్వి తరలిస్తే జలాశయం గుల్ల కావడం ఖాయమని, దాని ఉనికికే ముప్పు వస్తుందని.. రైతులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుండ్లకమ్మ స్పిల్‌వే గేట్ల నుంచి ప్రధాన జలాశయంలో కిలోమీటరు దూరం వరకు ఎలాంటి తవ్వకాలూ జరపకూడదని నివేదిక ఇచ్చామని.. గుండ్లకమ్మ ఈఈ మురళీ మోహన్ చెబుతున్నారు. దాని ప్రకారం అద్దంకి పరిధిలోని మణికేశ్వరం, మోదేపల్లి వైపే తవ్వకాలకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. ఒక అంచనా ప్రకారం జలాశయం నుంచి ఇసుక, మట్టి పూడిక తొలగింపుతో 0.03 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఇప్పటి వరకు ఉత్తర్వులు అందలేదని చెప్పారు.
ఇవీ చదవండి