సంక్రాంతి వచ్చిందంటే చాలు గజ గజ వణికించే చలిలో కూడా చేతిలో భిక్షముతో ఓ వ్యక్తి కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. తంబురా మీటుతూ, చిడతలు వాయిస్తూ, విన సొంపైన సంకీర్తనలు పాడుతూ... వచ్చే ఆ వ్యక్తే హరిదాసు. వీరు పాడే పద్యాలు వినసొంపుగా వుంటాయి. వీరి వస్త్రధారణ, అలంకరణ, మన పురాతన సంప్రదాయాలను, సంస్కృతిని కళ్ళకు కట్టినట్లుగా గుర్తు చేస్తుంది.
కళను కాపాడాలి
ఒకప్పుడు పల్లె నిదురలేవాలంటే... వారు రావాల్సిందే... వినసొంపైన వారి పద్యాలు వినపడాల్సిందే. రకరకాల సంకీర్తనలు ఆలపిస్తూ... కథలు చెప్తూ ఊరూరా తిరుగుతూ... బిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు హరిదాసులు. ఆర్ధిక సమస్యలున్నా... వందల ఏళ్లుగా వంశ పారంపర్యంగా వస్తోన్న కుల వృత్తిని కొనసాగిస్తున్నామంటున్నారు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన హరిదాసులు. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉంటుందనీ.. దైవంతో సమానంగా ఈ వృత్తిని చేపట్టామని చెబుతున్నారు. ప్రభుత్వం గుర్తించి అంతరించిపోతున్న తమ కళకు ఆర్ధికంగా సాయమందించి ఆదరించాలని వారు కోరుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల సంస్కృతిలో పడి మన సంప్రదాయాలను మర్చిపోతున్నారంటున్నారు ఈ హరిదాసులు. ఇక్కడ ఆదరణ తక్కువ కావడం వల్ల తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు వలస పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను, తమ కళను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: