* ఒంగోలులో కొవిడ్ బాధితులకు చికిత్స అందించే ప్రైవేట్ ఆసుపత్రి అది. ఒక ఉద్యోగి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. సిలిండర్లలో ఆక్సిజన్ అయిపోయింది. సాయంత్రం అందుతాయనుకున్నా రాలేదు. ఆసుపత్రి యాజమాన్యంలో ఆందోళన నెలకొంది. రోగి బంధువులకు సమస్య వివరించారు. ‘ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నం చేయండి.. లేకుంటే రోగి ప్రాణాలకే ముప్పు’ అని చెప్పారు. వారు నగరంలో తెలిసిన ఆసుపత్రులన్నీ తిరిగి ఒక సిలిండర్ సాధించారు. అది రాత్రి వరకే సరిపోయింది. పరిస్థితి చేయిదాటుతుందని భావించి సర్వజన ఆసుపత్రి వారితో మాట్లాడి బాధితుడిని అక్కడికి పంపించి చికిత్స అందించారు.
ఈ ఒక్కచోటే కాదు ఇతర ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రుల్లోనూ ఇదే సమస్య. ఆక్సిజన్ అందుబాటులో లేక చివరి దశలో జీజీహెచ్‌కి పంపుతున్నారు. మరికొందరు ఆక్సిజన్ లేదంటూ ముందే చేర్చుకోవడం లేదు. ఈ పరిస్థితి గత 15 రోజులుగా ఉంది.
డిమాండ్ పెరగడంతో...
మొత్తంగా జిల్లాలో రోజుకు 900 సిలిండర్లు అవసరం కాగా ఏజెన్సీ ద్వారా 500 నుంచి 600 వరకు అందుతున్నాయి. గుండ్లాపల్లి వద్ద గల శశిరేఖ ఏజెన్సీకి విశాఖ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. అక్కడ సిలిండర్లకు నింపి అందజేస్తారు. కొవిడ్ వేళ డిమాండ్ పెరగడంతో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని తహసీల్దార్, ఇంజినీర్లను సమన్వయకర్తలుగా నియమించారు. నగరంలోని రెండు కార్పొరేట్ ఆసుపత్రుల్లో 2 కిలో లీటర్ల నిల్వ సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకులు ఉండగా, మిగిలినవన్నీ సిలిండర్లపై ఆధారపడ్డాయి.
కేటాయింపులే అసలు సమస్య
జిల్లాలో 34 కొవిడ్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో ఒంగోలు జీజీహెచ్, కందుకూరు, చీరాల, మార్కాపురం ఏరియా అసుపత్రులు ప్రభుత్వానివి. మిగిలినవన్నీ ప్రైవేట్‌వి. ఇవి కాక ఆక్సిజన్ సిలిండర్లు వినియోగించే ఇతర ప్రైవేటు ఆసుపత్రులు 150 వరకు ఉన్నాయి. అన్నింటికి కలిపి రోజుకు 900 బల్క్ సిలిండర్లు అవసరం.
*కొవిడ్ బాధితులకు సరాసరిన రోజుకు ఒక సిలిండర్ అవసరం. వెంటిలేటర్ మీద ఉన్న రోగికి ఒక్కో సిలిండర్ మూడు గంటలు సరిపోతుంది.
* సాధారణ ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డలకు, ఆస్తమా సమస్య ఉన్నవారికి, ప్రసవానికి వచ్చినవారికి ఆక్సిజన్ అవసరమవుతుంది. అలాంటి వారికి ప్రస్తుతం వారానికి రెండు చొప్పున అందజేస్తున్నారు.
* ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో 80 వెంటిలేటర్లు, 350 ఐసీయూ పడకలు ఉండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 150 వరకు ఆక్సిజన్ పడకలు ఉన్నాయి.
చీరాల..ఏమాత్రం ఆలస్యమైనా..
చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: చీరాల ఏరియా ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రంలో 90 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. అరగంటకు ఒక పెద్ద సిలిండర్(7 లీటర్లు) అవసరమవుతుంది. కొన్నిసార్లు సరఫరా చేయడంలో కొంత ఆలస్యం జరిగి బాధితులకు ఇబ్బంది తప్పడం లేదు. ఇక పట్టణంలోని మరో 3 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పాజిటివ్ రోగులకు చికిత్స ఇస్తున్నారు. వీటిలో సుమారు 70 పడకలు ఉన్నాయి. 40 వరకు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం. ప్రస్తుతం ఒంగోలు నుంచి తీసుకొచ్చి ఆసుపత్రులన్నింటికీ వినియోగిస్తున్నారు. సూపరింటెండెంట్ శేషుకుమార్‌ను వివరణ కోరగా... రోజుకు ఏరియా ఆసుపత్రిలో ఉన్న 90 పడకలకు 50 సిలిండర్ల అవసరం ఉందన్నారు. ముందుస్తుగానే వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకుని సరఫరా చేయిస్తున్నామన్నారు. రోగులు పెరిగితే సిలిండర్ల అవసరం ఇంకా ఉంటుందన్నారు. అవకాశం ఉన్నంత వరకు పూర్తిస్థాయిలోనే ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తున్నట్లు తెలిపారు.
మరో ఏజెన్సీకి అనుమతి: రవి, ఏపీఎంఐడీసీ పర్యవేక్షక ఇంజినీర్
వారం క్రితం కన్నా ఆక్సిజన్ సిలిండర్లకు ఒత్తిడి తగ్గింది. శశిరేఖ ఏజెన్సీతో పాటు అమరావతి అనే మరో ఏజెన్సీకి అనుమతి ఇచ్చారు. వారి ద్వారా కూడా ఇకపై కొన్ని సిలిండర్లు అందుతాయి. ఇవికాక అత్యవసరం కోసం ఆక్సిజన్ కాన్సట్రేటర్లు 600 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ ట్యాంకరు సకాలంలో తెప్పించడానికి కృషి చేస్తున్నాం.
ఇదీ చదవండీ… ఆగని రెమ్‌డెసివిర్ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు