ప్రకాశం జిల్లా చీరాల పురపాలక సంఘం పరిధిలో అధికారుల నిర్లక్ష్యంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం తుప్పుపట్టిపోయింది. వేటపాలెం మండలం రామాపురం వద్ద 15 ఎకరాల స్థలాన్ని సేకరించగా ..రు.5.79 కోట్లతో 2010 డిసెంబర్ 1న కేంద్రం నిర్మాణం చేశారు. ఇందుకోసం ప్రాజెక్టులో కేంద్రప్రభుత్వం వాటాకింద రు.2.88 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటాకింద రు.36.10 లక్షలరూపాయలు... అర్బన్ లోకల్ బాడీ నిధులు రు.2.54 కోట్లు నిధులు ఉన్నాయి. ఈ నిధులతో కేంద్రం చుట్టూ ప్రహరి గోడ నిర్మించారు. పలు చోట్ల పక్కా షెల్టర్లు, యంత్రాలకు అవసరమైన ఫ్లాట్ ఫారంలు ఏర్పాటు చేయగా కొబ్బరి బొండాల నుంచి పీచు వలిచేందుకు, కన్వేయర్ బెల్ట్, బయో ఫ్లమేనేజర్, సెనెంట్ ల్యాండ్ ఫిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు.
చీరాల పట్టణం నుంచి రోజువారి వచ్చే 29 టన్నుల చెత్తను ఈ కేంద్రానికి తరలిస్తారు. ఆ వ్యర్థాల నుంచి వర్మి కంపోస్టు ఎరువు తయారీతో పాటు ఇతర కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. నాలుగు ఏళ్ల నుంచి ఈ కేంద్రం నిర్వహణలోకి వచ్చినా... చెత్త తరలింపు సమస్యగా మారింది. తడి చెత్తను రామాపురం మీదుగా నివాస గృహాల మధ్య నుంచి తరలించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంతకాలంగా పనులు నిలిచిపోయాయి. అప్రోచ్ రహదారి నిర్మాణానికి వేటపాలెం మండల రెవెన్యూ అధికారులకు స్దలసేకరణ కోసం చీరాల పురపాలిక సంఘం తరపున 19 లక్షల రూపాయలు నగదు చెల్లించారు. ఈ మొత్తం చెల్లించి మూడేళ్లు గడుస్తున్నా... నేటికి నిర్మాణమే లేదు. దీంతో ప్రాజెక్టు లక్ష్యం నీరు గారిపోయింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా మిగిలాయి.
2018లో కేంద్రప్రభుత్వం చీరాల పురపాలక సంఘానికి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని ప్రకటించి అవార్డు అందజేసింది. ఈ ఏడాది ఆగస్టు నెలలోనూ స్వచ్ఛత కింద రెండో స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ కింద అవార్డులతో పాటు దక్షిణభారతంలో సస్టేనబుల్ శానిటేషన్ కింద తొలి స్థానంలో చీరాల గుర్తింపు పొందింది. ఈ గుర్తింపునకు కారణమైన కేంద్రాన్ని అధికారులు అటకెక్కించటంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహదారి కోసం అవసరమైన స్థల సేకరణ పూర్తైతే..రూ. 50 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వెయ్యటానికి నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ యేసయ్య అన్నారు. యంత్రాలు దెబ్బతినకుండా అవసరమైన ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి.
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు