ప్రకాశం జిల్లాలో కేసులు పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒంగోలు నగరం మొత్తం కంటెయిన్‌మెంట్ జోన్‌గా పరిగణిస్తూ ఆ మేరకు ఆంక్షలను కఠినం చేసింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. చీరాలలోనూ కేసులు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే ఆ ప్రాంతం కూడా నిర్బంధంలో ఉంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదైన చోట కంటెయిన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అలానే ఆరో విడత సర్వేను ఆయా ప్రాంతాల్లో పక్కాగా నిర్వహించి, పక్కా వైద్య పరీక్షల నిర్వహణతో కరోనా దూకుడుకు కళ్లెం వేసేలా సన్నద్ధమయ్యారు.
కొమరోలు మండలం రెడ్డిచర్ల, పొన్నలూరు, పర్చూరు, వలేటివారిపాలెం, కందుకూరు, చెరుకూరు, వలేటివారిపాలెం మండలం చుండి, మార్కాపురం మండలం వేములకోట, ఒంగోలు గోపాలనగర్, చోళ్లవీడు, చీరాల, ఒంగోలు సుజాత నగర్, ఇస్లాంపేట, దర్శిలో కొత్తగా కేసులు వచ్చాయి. వ్యాధి సోకిన వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు, పక్క ఇళ్ల వారికి పరీక్షలు చేసేందుకు నమూనాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఒకరితో మొదలయ్యాం.. 11 మంది అవుతాం'