ప్రకాశం జిల్లాలో కొత్తగా 47 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు వ్యాప్తి చెందుతోంది. త్వరగా కోలుకుని డిశ్ఛార్జి అవుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. పశ్చిమ ప్రాంతంలో ఒక ప్రజాప్రతినిధి మనవడికి వ్యాధి సోకింది. అతని వద్ద పనిచేసే కారు డ్రైవరు, సహాయకుడు వైరస్ బారిన పడ్డారు. వారిని జీజీహెచ్‌కి తీసుకొచ్చి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు.
కొత్త కేసుల వివరాలు..
మార్కాపురంలో 8, కందుకూరులో 4, ఒంగోలు 8, సింగరాయకొండలో 3, చీరాలలో 6, మంగమూరులో 2, రావికుంటపల్లి 2, రామభద్రాపురం 3, ఇంకొల్లులో 2, యర్రగొండపాలెం, టీబీవీపాలెం, పేర్నమిట్ట, వలేటివారిపాలెం, పోలినేని చెరువు, తూర్పు గంగవరం, తాళ్లూరు, ఏహెచ్ కందుకూరు, జరగువారిపాలెంలో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.
సన్నిహితుల గుర్తింపు తప్పనిసరి
కరోనా పాజిటివ్ కేసు నమోదైన వెంటనే వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను గుర్తించి పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. అన్ని జిల్లాల వైద్యాధికారులతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్షల నివేదికలు వచ్చే వరకు క్వారంటైన్‌లోనే ఉంచాలన్నారు. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ఫీవర్ క్లినిక్‌లు నిర్వహించాలన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ కరోనా పరీక్షలు చేయాలన్నారు.
ఇదీ చదవండి: నవంబరు నుంచి పోలవరానికి గేట్లు... సీఎం నిర్దేశం