కొవిడ్ కారణంగా గత 6 నెలలుగా సినిమా హాళ్లు మూతపడ్డాయి. వాటితోపాటే థియేటర్ల యజమానులు, అందులో పనిచేసే కార్మికులు, హాళ్ల మీద ఆధారపడి బతికే ఎందరో జీవితాలు తలకిందులయ్యాయి. మొన్నటివరకూ ఎందరికో ఆసరా ఇచ్చిన వారే నేడు కుటంబాలను పోషించుకోవడం కోసం కిందామీదా పడుతున్నారు.
జీవనం భారమై..
థియేటర్లు మూతపడటంతో చాలామంది హాలు యజమానులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై దృష్టిపెట్టారు. ఎలాగొలా జీవనం సాగించడానికి సన్నద్దమయ్యారు. కరోనా కాలంలో నిత్యావసరాల దుకాణాలు తప్ప వేరేవాటికి అంతగా జనాదరణ ఉండడంలేదు. దీంతో పాల వ్యాపారమో, కూరగాయలు అమ్మడమో చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. సినిమా హాళ్లు తెరుచుకోకపోవడం వల్ల వాటి యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ, అద్దెల భారం, నెలవారీ కిస్తీలు తలకు మించిన భారంగా మారాయి. పెట్టుబడులపై వడ్డీల భారం పెరిగిపోతోంది. వీటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
ప్రకాశం జిల్లా పర్చూరులోని ఓ సినిమా థియేటర్ యజమాని పాల వ్యాపారం మొదలుపెట్టాడు. తన సినిమా హాలు ముందే టేబుల్ వేసి పాలు అమ్ముకుంటున్నాడు. గ్రామాల నుంచి పాలు సేకరించి తెచ్చి పట్టణంలో విక్రయిస్తున్నాడు. అతనిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతుండగా.. అతను మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఈ కష్ట సమయంలో నామోషీలకు పోతే కుటుంబం గడవడం కష్టమని... అందుకే ఎవరేమనుకున్నా పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాని చెప్తున్నాడు. రాష్ట్రంలోని చాలామందికి ఇదే పరిస్థితి.
కరోనా ఉద్ధృతితో ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కనపడడంలేదు. అయితే ఇదే కొనసాగితే తమ బతుకులు దుర్భరమవుతాయని.. కనీసం వచ్చే సెప్టెంబర్ నెల నుంచి అయినా సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకుంటామని చెప్తున్నారు.
ఇవీ చదవండి: