కరోనా విలయతాండవంతో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. విద్యారంగం అందుకు అతీతం కాదు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటివరకూ తెరుచుకోలేదు. మున్ముందూ ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి ఇరకాటంలో పడింది. జీతాలు రాక, కుటుంబాలు నడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు కొద్దో గొప్పో సాయం చేస్తున్నా.. అది ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు.
ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు అద్దంకి నియోజకవర్గాల్లో 130 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 1100 మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తరగతులు జరగడంలేదు. ఫీజులు రాక యాజమాన్యాలు జీతాలు ఇవ్వడంలేదు. ఈ తరుణంలో కుటుంబం గడవడానికి అప్పులు చేస్తున్నామంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. కొంతమంది బండ్ల మీద కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నారు.
తమను ప్రభుత్వం ఆదుకోవాలని, అప్పుడే ఈ పరిస్థితి నుంచి బయటపడగలమని అంటున్నారు. అన్ని రంగాలలో వారికి చేసినట్లే తమకు సహాయం అందించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి...