ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి వద్ద పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కొందరు నాయకులకు కలిసొచ్చింది. స్థలం ఎంపికపై తొలినుంచి స్థానికులు అభ్యంతరం చెప్పిన ప్రైవేటు భూములు కొనుగోలు చేయకపోగా... ప్రభుత్వ భూమిలో చదునుకే రూ.లక్షల్లో ఖర్చుపెట్టి లేఔట్లు వేశారు. పట్టాల పంపిణీ పలుసార్లు వాయిదా పడినా అధికారులు పట్టించుకోలేదు. చౌడు భూమిలో చిన్నపాటి వర్షాలకే నీళ్లు వస్తున్నాయి. ఇళ్లపట్టాలపై కోర్టు నుంచి వరుస స్టేలు వస్తుండటంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
నివాసయోగ్యం కానిచోట ఇళ్లపట్టాల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ సొమ్ము వృథా అయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.51.92 లక్షల వ్యయంతో 35.28 ఎకరాల భూమిలో 6.6 ఎకరాలు ఎంపిక చేశారు. దర్శి మండలం రాజంపల్లి-లక్ష్మీపురం ప్రధాన రహదారికి పక్కనే 371,372,373 సర్వే నెంబర్లు ఉన్నాయి. 201మందికి అక్కడ పట్టాలు ఇచ్చేందుకు చదును చేశారు. గడ్డి పోరంబోకు, చౌడు భూమి, ముంపునకు గురవుతుందని గ్రామస్తులు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు. పక్కనే మట్టిన తవ్వి రోడ్లు ఏర్పాటు చేశారు. గడ్డి పొరంబోకులో నివేశన స్థలాలు ఎలా ఇస్తారని...గ్రామానికి చెందిన ఫణిదపు వెంకటరావు హైకోర్టులో రిట్‌పిటిషన్ వేశారు.
దానిపై కోట్లు స్టే విధించింది. దీనికి సంబంధించి అధికారులు ఆరు వాయిదాల్లో కోర్టుకు వివరణ ఇచ్చారు. నెలకోసారి కోర్టు స్టే ఇస్తూ వస్తోంది. లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. స్థలం విషయంలో మొదటి నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ...వివాదం కోర్టుకు వెళ్లి పరిణామాల మధ్యనే చదును చేసి లేఔట్లు వేయటం గమనార్హం.
జముకులదిన్నె మార్గంలో స్థలమున్న...గ్రామానికి కీమీ దూరంలో ఉన్న జముకులదిన్నె రోడ్డు మార్గంలో ఉన్న 194 సర్వే నెంబర్లో ఇంటి పట్టాలు ఇవ్వాటానికి...6ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ స్థలం ఎంపిక చేయకుండా గడ్డి పోరంబోకు స్థలంలో ఎంపిక చేయటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లేఔట్లు వేసిన చిన్నపాటి వర్షాలకు నీళ్లు వస్తాయని...పక్కనే ఉన్న వాగు ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైందన్నారు.