Stella Ship Case Updates : కాకినాడ తీరానికి 9 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు అధికారుల బృందం నేడు మరోసారి వెళ్లనుంది. ఆఫ్రికాలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి వెళ్లాల్సిన ఈ నౌకలో సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్‌కు చెందిన 1320 టన్నుల పేదల బియ్యాన్ని జిల్లా యంత్రాంగం గుర్తించింది. నౌకలో నుంచి అక్రమ నిల్వలు దించి సీజ్ చేసి గోదాముల్లో భద్రపరచాల్సి ఉంది.
ఇందుకు ప్రాథమికంగా అవసరమైన కస్టమ్స్ శాఖ అనుమతి దక్కడంతో పౌరసరఫరాలు, కస్టమ్స్, పోర్టు, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షిప్‌లోని నిల్వల స్వాధీనానికి సన్నాహాలు చేస్తోంది. వాతావరణం అనుకూలిస్తే నౌక నుంచి బియ్యం నిల్వలు 14 నుంచి 16 గంటల్లో కిందికి దించవచ్చని అధికారులు భావిస్తున్నారు. సముద్రంలోని షిప్ దగ్గర్నుంచి యాంకరేజి పోర్టులోని లంగరు రేవు వద్దకు బియ్యం బస్తాలు చేరవేయడానికి అవసరమైన రెండు బార్జీలనూ సిద్ధంచేశారు.
అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొంది. దీనికితోడూ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ శాఖ కాకినాడ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ఈ ప్రక్రియ సాధ్యమవుతుందా? మరికొంత సమయం పడుతుందా? అన్నది వాతావరణ పరిస్థితులపై ఆధాపడి ఉంది. స్టెల్లా నౌకలో అక్రమ నిల్వలు దించిన తర్వాత ఇతర ఎగుమతి సంస్థలకు చెందిన బియ్యం నిల్వలు షిప్‌లోకి ఎక్కించాల్సి ఉంది. ఈ లెక్కన ఈ నౌక మరో 10 రోజుల పాటు కాకినాడ తీరంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
Ration Rice Smuggling in AP : షిప్ కాకినాడ తీరంలోనే ఉండిపోవటంతో రోజుకి రూ.20 లక్షల డెమరేజ్ భారం పడుతోంది. ఈ రుసుము చెల్లింపుపైనా సందిగ్ధత నెలకొంది. లంగరు రేవులో బార్జీలో గుర్తించిన లావణ్ ఇంటర్నేషనల్, సాయి తేజ ఆగ్రోకు చెందిన 1064 టన్నులు పీడీఎస్ నిల్వల స్వాధీనానికి కస్టమ్స్ అనుమతి రావల్సి ఉంది. అనుమతి రాగానే సీజ్ చేసిన ఈ నిల్వలనూ గోదాముల్లోకి తరలించే అవకాశం ఉంది.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - కాకినాడ పోర్టు 'పుష్ప' ఎవరు?