ప్రకాశం జిల్లాలోని ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య పరికరాలు, పడకలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ పోలా భాస్కర్.. సిబ్బందికి సూచించారు. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రిమ్స్‌లో సమీక్ష..
ఒంగోలు రిమ్స్‌లో రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై అధికారులు, సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించారు. రిమ్స్‌తో పాటు పట్టణంలోని పలు చోట్ల క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని ఆయన వెల్లడించారు. సుమారు 570 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర పరకరాలు అవసరమైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
'కొరత ఉంటే ప్రతిపాదనలు ఇవ్వాలి'
వనరులు సమకూర్చుకోవడానికి ఆస్పత్రికి నిధుల కొరత ఉంటే అవసరమైన నిధులు సమకూర్చి పరికరాలు తక్షణం సమకూరుస్తామన్నారు. ఇందుకు వెంటనే తగిన ప్రతిపాదనలతో రావాలన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కునేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. జేసీ చేతన్, రిమ్స్ వైద్యాధికారి శ్రీరాములు, సిబ్బంది పాల్గొన్నారు.