ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించ తలపెట్టిన శీతల గిడ్డింగి పనులు ముందుకు సాగటం లేదు. దర్శి చుట్టుపక్కల రైతులు మిరప, కంది, పెసర, శనగ, మినుములతో పాటు ఇతర పంటలు విస్తారంగా పండిస్తారు. వాటిని నిల్వచేసుకోవటానికి శీతలగిడ్డింగి కావాలని కోరటంతో తెదేపా హయంలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు 5 కోట్లు మంజూరు చేశారు. అనంతరం శీతల గిడ్డంగికి శంకుస్థాపన చేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు.
వైకాపా అధికారంలోకి రాగానే గిడ్డంగి పనులు నిలిచిపోయాయి. తెదేపా ప్రభుత్వ హయంలో మార్కెట్ యార్డులో గిడ్డంగి అవసరమని ప్రతిపాదనలు పంపిన అధికారులు... ఇప్పుడు గిడ్డంగి అవసరమా లేదా అనే అంశంపై ప్రతిపాదనలు పంపాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రైతులు మాత్రం శీతలగిడ్డంగి నిర్మించాలని కోరుతున్నారు.