నకిలీ వెబ్సైట్ సృష్టించి ఓ వ్యక్తికి గ్యాస్ డీలర్ షిప్ ఇప్పిస్తామని చెప్పి మోసగించిన ఇద్దరు పశ్చిమబంగా యువకులను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు కటాకటాల్లోకి నెట్టారు. పశ్చిమబంగాకు చెంది టన్సన్ నాయక్, మానిక్ పట్నాయక్‌లు చీరాల మండలం పాతచీరాలకు చెందిన సమ్మెట స్వామినాథ్కు గ్యాస్ డిలర్ షిప్ ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం నిందితులు ఒక నకిలీ వెబ్సైట్ రూపొందించారు. వీరిని నమ్మిన స్వామినాథ్ దరఖాస్తు నిమిత్తం మొదటిగా రూ.22 వేలు ఆన్లైన్ ద్వారా ఖాతాలో వేశారు. అప్పటి నుంచి పలు దఫాలుగా సుమారు రూ.8 లక్షలు స్వామినాథ్ నుంచి నిందితులు వసూలు చేశారు. అప్పటి నుంచి ఫోన్ చేసినా సమాధానం రాకపోయేసరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు జనవరిలో చీరాల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్జానంతో కేసును ఛేదించిన పోలీసులు నిందితులను కోల్‌కతాలో అరెస్టు చేసి చీరాలకు తీసుకొచ్చారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: