ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. అయినప్పటికీ కొంతమంది వీటిని ఆచరణలో పాటించడం లేదు. కేవలం లాభాల కోసం అన్ని వేళల్లోనూ వ్యాపారం సాగిస్తూ.. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
యథావిధిగా అమ్మకాలు..
మార్టూరు, వలపర్ల గ్రామాల్లో సాగుతున్న ఈ వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. మండలంలో కొవిడ్ ఆంక్షల అమలుకు కలెక్టర్ భాస్కర్ గత నాలుగు రోజుల క్రితం సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే సరకులు విక్రయించాలని.. కరోనా నియంత్రణ మండల కమిటీ అధికారులు నిర్ణయించారు. కానీ కొందరి వ్యవహారశైలి వైరస్ను వ్యాప్తి చెందించేలా ఉంది. పోలీస్ వాహనం సైరన్ వినిపించిన సమయంలో దుకాణాల తలుపులు మూయడం.. వారు వెళ్లిన వెంటనే తిరిగి తెరిచి యథావిధిగా అమ్మకాలను కొనసాగించటం నిత్యకృత్యమైపోయింది.
నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు..
ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఎలాంటి షరతులు లేకపోవటం.. మందుబాబులు అన్నివేళల్లో ఆయా దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ వెంకటరెడ్డిని ప్రశ్నించగా.. నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్లు అందుబాటులో ఉంచేలా పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా నిషేధిత సమయంలో దుకాణాలు తీసి వ్యాపారం సాగిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి...