రామచంద్రాపురానికి చెందిన కోడూరి వెంకటేశ్వర్లు కుటుంబానికి, గ్రామస్థుల మధ్య గతంలో వివాదం నెలకొంది. అప్పట్లో జిల్లా అధికారులు జోక్యం చేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తన కుమారుడు రాజును గ్రామంలోకి రానీయడం లేదని, జీవోనోపాధికి ఉపయోగించే పడవ, వలలను గ్రామస్థులు స్వాధీనం చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నామని... వెంకటేశ్వర్లు ఇటీవల లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాల్సిందిగా పోలీసులను లోకాయుక్త ఆదేశించడంతో... అధికారులు గ్రామంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ జేడీ ఆవుల చంద్రశేఖరరెడ్డి ఇరుపక్షాలతో మాట్లాడి... వారివారి వాదనలు విన్నారు. గ్రామానికి రూ.2 లక్షల మేర బకాయి ఉన్నట్లు స్థానిక పెద్దలు తెలిపారు. మార్చి నెలాఖరుకు ఆ మొత్తం చెల్లిస్తామని వెంకటేశ్వర్లు చెప్పడంతో... పడవ, వలలను తిరిగి ఇచ్చేందుకు గ్రామస్థులను అధికారులు ఒప్పించారు. సమావేశంలో తహసీల్దార్ కేఎల్ మహేశ్వరరావు, చీరాల మత్స్యశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ రంగనాథ్‌బాబు, చీరాల గ్రామీణ సీఐ రోశయ్య, వేటపాలెం ఎస్సై కమలాకర్, ఎఫ్‌డీవో నాయక్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు