ఓ వ్యక్తి దాతృత్వం.. ఇళ్లులేని కొంత మంది నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఇంటి స్థలాలు ఇచ్చేలా చేసింది. 4ఎకరాల వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి నిరుపేదలకు ఇచ్చాడా వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం!
ప్రకాశంజిల్లా కురుచేడు మండలం పోట్లపాడు గ్రామానికి చెందిన దేవసాని. లక్ష్మీరెడ్డి, గోవిందమ్మల కుమారుడు రామ మనోహరరెడ్డి తనకున్న నాలుగు ఎకరాల సొంత భూమిని గ్రామంలోని నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్లాట్లుగా మార్చి వారికి దానంగా ఇచ్చాడు.
రామమనోహరరెడ్డి వ్యాపార రీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు. పుట్టిన ఊరిపై ఉన్న మమకారంతో గ్రామంలోని నిరుపేదలకు తన వంతు సహాయం అందించాలనే సంకల్పంతో పోట్లపాడు గ్రామంలోని సర్వే నంబరు 375/2 లో తనకు హక్కు కలిగిన నాలుగు ఎకరాల భూమిని 150 మందికి 107 చ.గ ల వైశ్యాల్యంతో ప్లాట్లుగా మార్చి గ్రామంలోని నిరుపేదలకు దానం ఇచ్చాడు. గ్రామ పెద్దల సమక్షంలో దాన పత్రాలను లబ్దిదారులకు అందించాడు.
"నా కుమారుడు స్వచ్చందంగా గ్రామానికి తన వంతు సహాయం అందించాలనే వాంఛతో గ్రామంలోని నిరుపేదలకు నివేశనా స్థలాలను దానం ఇచ్చాడు. మాకున్న దానిలో ఎంతోకొంత దానం చేయాలి అని ఉద్దేశ్యముతోనే దానం ఇచ్ఛామే కానీ ఎటువంటి రాజకీయ ఆలోచనతో కాదు." -గోవిందమ్మ, రామమనోహరరెడ్డి తల్లి
"మూడు దశాబ్దాల క్రితం పోట్లపాడు వదిలి బెంగుళూరులో స్థిరపడ్డాడు. స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా లక్షలరూపాయల్లో దాన ధర్మాలు చేస్తుంటారు." -పోట్లపాడు గ్రామస్థులు
తనకు పబ్లిసిటీ ఇష్టముండదు కనుకనే మీడియా మిత్రులకు తెలియపరచలేదు అని రామమనోహరరెడ్డి అన్నారు. జనవరి 18వ తేదీన మిగిలిన వారికి కూడా ఇళ్ల స్థలాలు దానం చేస్తానని సమయంలేనందువలన, ముఖ్యమైన పని ఉండుట వలన బెంగుళూరు వెళుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: AP Cabinet meet: ఈ నెల 17న కేబినెట్ సమావేశం..అసెంబ్లీ సమావేశాలపై చర్చ